Dont Do This Things On Friday : హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఓ ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని విశ్వాసం. అయితే తెలిసో తెలియకో శుక్రవారం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. అసలు శుక్రవారం ఏ పనులు చేయవచ్చు? ఏవి చేయకూడదో తెలుసుకుందాం
శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమం వద్దు
కొంతమంది శుక్రవారం రోజు పూజామందిరంలో దేవీ దేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే పూజ సామాగ్రిని శుభ్రం చేసి, మళ్లీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ, గురు వారాలు, ఆది సోమవారాలు మంచిది. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్లిపోతుందంట!
శుక్రవారం ఇవి బయట పడేస్తే సంపదను కూడా పడేసినట్లే
కొంతమంది ఇంట్లో పనికిరాని, విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం , దేవుళ్ల పటాలను దేవాలయంలో చెట్టు కిందనో, లేకుంటే మరో చోటనే వదిలి పెడుతూ ఉంటారు. కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి కానీ బయటకు పంపితే దారిద్య్ర బాధలు తప్పవు.
శుక్రవారం అప్పుతో ముప్పులు
శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయండి కానీ అప్పుగా ఇవ్వొద్దు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ, అప్పు గాని తీసుకోకూడదు. అలా చేసే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
దీపాల వేళ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం
ప్రతిరోజూ సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరిసంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి.
శుక్రవారం లక్ష్మీ దేవిని ఎవరికి ఇవ్వరాదు
సాధారణంగా మనం బంధు మిత్రుల ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ కానుకగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరికి అందజేసినట్లే అని జ్యోతిష శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
తరగని సంపద కోసం ఇలా చేయాల్సిందే
ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్ఠలతో అష్టోత్తర శత నామాలతో పూజించాలి. ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి. దీపాల కాంతులతో లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలా చేయడం ద్వారా గృహంలో సంపదలతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది.
ఈ స్తోత్రాలు చదివితే తరగని సంపదలు సొంతం
ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో కనకధారా స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, మణిద్వీప వర్ణన వంటివి పారాయణ చేయడం వల్ల తరగని సంపదలు సొంతమవుతాయని శాస్త్రవచనం.
శాస్త్రంలో చెప్పిన ఈ శుక్రవార నియమాలు పాటిద్దాం. ఐశ్వర్యాన్ని పొందుదాం.
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.