Why Lord Krishna Had 16000 Wives : హిందూ పురాణాలలో ఎన్నో ధర్మ సందేహాలు! ముఖ్యంగా ఇతిహాసాల గురించి, పౌరాణిక గ్రంథాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా, కొందరు కొన్ని అంశాలను ఎత్తిచూపుతూ విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో శ్రీకృష్ణుడి 16వేల మంది భార్యల విషయం ఒకటి. అయితే దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ కథనంలో చేద్దాం.
ఏకపత్నీవ్రతుడే గోపిలోలుడు!
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణుని అవతారం కూడా ఒకటి. త్రేతాయుగంలో ఏకపత్నీ వ్రతుడిగా, పితృవాక్య పరిపాలకుడిగా శ్రీరాముడిగా ఖ్యాతి గడించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో గోపిలోలుడిగా పేరుగాంచాడు. అష్ట భార్యలతో పాటు పదహారు వేలమంది భార్యలతో చిలిపి కృష్ణుడని పేరు తెచ్చుకున్న కృష్ణుడికి అసలు 16వేల మంది భార్యలు ఎందుకున్నారో తెలుసా! దాని వెనుక ఉన్న రహస్యమేమిటో తెలుసుకుందాం.
పౌరాణిక గాథ
ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి 16వేల మంది భార్యలు ఉండడం వెనుక ఉన్న పౌరాణిక రహస్యమేమిటో చూద్దాం.
నరకాసురుని చెరలో 16వేల మంది
ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించే నరకాసురుడు 16,100 యువతులను అపహరించి తన కారాగారంలో బంధించి ఉంచాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించాడు. ఆనాటి సామజిక కట్టుబాట్లను అనుసరించి కొంతకాలం రాక్షసుని చెరలో ఉన్నవారిని తిరిగి వారి కుటుంబాలలోకి అనుమతించరు. అందుచేత శ్రీకృష్ణునిచే రక్షింపబడిన ఆ 16వేల మంది గోపికలు కృష్ణునితో "కృష్ణా! నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము అపవిత్రులమవుతాం, దయచేసి మమ్మల్ని భార్యలుగా స్వీకరించండి" అని వేడుకున్నారు. ఫలితంగా, శ్రీకృష్ణుడు వారిని 'భార్యలుగా' అంగీకరించాడు. ఇది పౌరాణికంగా ప్రాచుర్యంలో ఉన్న కథనం.
ఆధ్యాత్మిక వాస్తవం
ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి వ్యక్తిలో నిత్యం ఎన్నో ఆలోచనలు, కోరికలు పుడుతుంటాయి. శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం. పదహారువేల మంది భార్యలు అనేది మనుషులలోని పదహారువేల కోరికలు, భావనలు, మనోభావాలు అని భావించవచ్చు. శ్రీకృష్ణుడు 16 వేల భావనలతో మమేకమై ఉండేవాడని, ఈ భావనలే 16వేల మంది భార్యలని ఆధ్యాత్మిక సాధకులు అంటారు.
ఎనిమిదే తుది
ఏది ఏమైనా శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలన్నది మాత్రం నిజం. వీరినే "అష్టమహిషులు" అంటారు. ఇక 16వేల మందితో శ్రీకృష్ణుడికి ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. వారంతా శ్రీకృష్ణుని ఆరాధనలోనే తమ జీవితాన్ని సార్థక్యం చేసుకున్నారన్నది వాస్తవం.
అంతా పరమాత్మ స్వరూపమే!
రామునిగా ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించినా, కృష్ణుడిగా బహు భార్యలను ఆదరించినా అదంతా ఏక స్వరూపమైన పరమాత్మ పారమార్థిక రహస్యం. ఇదే పరమాత్మ అవతార రహస్యం. ప్రేమతత్వమే కృష్ణ తత్వమని గ్రహించడమే మనిషి కర్తవ్యం. - జై శ్రీకృష్ణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.