తిరుమలకు చేరుకోవడానికి 3 కాదు- మొత్తం 8 మార్గాలున్నాయట! మీకు తెలుసా?
ఏడు కొండలకు ఎనిమిది మార్గాలు- దారి ఏదైనా గమ్యం ఒకటే!

Published : September 26, 2025 at 2:49 AM IST
Tirumala Reach Eight Routes: కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రం సాక్షాత్తూ వైకుంఠధామం. ప్రతి ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా తిరుమల గిరులు క్రిక్కిరిసి పోతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని దారులు తిరుమలకే! ఏ నోట విన్నా శ్రీనివాసుని దివ్యనామమే! తిరుమల చేరుకోడానికి అందుబాటులో ఉన్న దారులు అలిపిరి నుంచి నడక మార్గం, మరొకటి శ్రీనివాస మంగాపురం నుంచి ఉన్న శ్రీవారి మెట్టు మార్గం. వాహనాల్లో పైకి వెళ్ళడానికి అలిపిరి నుంచి ఘాట్ రోడ్ అందుబాటులో ఉంది. మనకు తెలిసినంత వరకు ఈ మూడు మార్గాలు అయితే వాస్తవానికి ఏడుకొండలవానిని చేరుకోడానికి ఎనిమిది మార్గాలు ఉన్నాయంట! ఆ వివరాలేమిటో ఈ కథనంలో చూద్దాం.
ఏడు కొండలకు ఎనిమిది మార్గాలు!
సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి. రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి ఘాట్ రోడ్లు ఉన్నాయి. అయితే ఏడుకొండలవాడిని చేరుకోవడానికి ఉన్న ఈ 8 మార్గాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1. ఆదిపడి లేదా అలిపిరి:
తిరుమలకు వెళ్ళడానికి ప్రస్తుతం ఎక్కువమంది వాడుతున్న దారి ఇదే! అలిపిరిని పూర్వం ఆదిపడి అని పిలిచేవారు. క్రీ.శ.1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర ఆదిపడి మెట్లు నిర్మించారు. ఆదిపడి అంటే మొదటి మెట్టు అని అర్థం. క్రీ.శ.1550లో విజయనగర సామంతులు అలిపిరి, గాలిగోపురం మార్గం నిర్మించారు. మొదటి నుంచి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. ఆదిపడి కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్ల నడవాలి. అలిపిరి మార్గంలో మొత్తం 3550 మెట్లు ఉన్నాయి. ఈ మార్గంలో భక్తులు కాలినడకన సుమారు మూడు నుంచి నాలుగు గంటల్లో కొండను చేరుకొంటారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే!
2. శ్రీవారి మెట్టు
తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారిలో మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. భక్తులు ఈ మెట్టు దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. కానీ ఈ మార్గం కొంత శ్రమతో కూడుకున్నది.
3. మామండూరు అడవి
తిరుమలకు చేరుకోవడానికి మూడవ మార్గమైన మామండూరు అటవీ మార్గం ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి. పూర్వం కడప, రాజంపేట కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. మామండూరు నుంచి బయలుదేరితే కరివేపాకు కోన, పాల సత్రం, ఈతకాయల మండపం మీదుగా వెళ్తే తిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది. అక్కడ నుంచి తిరుమలకు భక్తులు సులభంగా చేరుకునే వారు. అయితే పూర్వం ఈ మార్గమంతా దట్టమైన అరణ్య ప్రాంతం, ప్రస్తుతం అంతగా వాడుకలో లేని మార్గం. అయితే ఇప్పటికి అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమలకు చేరుకుంటారు.
4. కుక్కల దొడ్డి
తిరుమలకు చేరుకోవడానికి నాలుగో మార్గం కుక్కల దొడ్డి. కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కల దొడ్డి నుంచి తుంబురు తీర్థం మీదుగా పాపవినాశనానికి అక్కడ నుంచి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం నుంచి తుంబుర తీర్థానికి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాపవినాశనం నుంచి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గాన్ని తక్కువ మంది వినియోగిస్తున్నారు.
5. కళ్యాణి డ్యామ్
తిరుమలకు చేరుకోవడానికి కళ్యాణి డ్యామ్‌కి ఆనుకొని ఉన్న శ్యామల కోన దారిలో పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒక గంటలో భక్తులు తిరుమలకు చేరుకోవచ్చు.
6. రేణిగుంట నుంచి అవ్వచారికోన దారి
తిరుమలకు చేరుకోవడానికి ఉన్న మరో మార్గం ఇది. ఈ అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడ నుంచి అవ్వాచారి కోన దిగువ భాగంలో నడిచి పడమర వైపునకు వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి ఆలయం ఉంది. అక్కడి నుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వస్తుంది. మెట్టు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. ఈ మార్గంలో తిన్నగా నడుచుకుంటూ వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.
7. ఏనుగుల దారి
తిరుమలకు చేరుకోవడానికి ఏడవ దారి ఏనుగుల దారి. ఒకప్పుడు చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు మార్గం నుంచి అవ్వాచారి కోన వరకు ఒకదారి ఉండేది. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారిలోనే ఏనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ప్రస్తుతం ఈ మార్గం అంత సురక్షితం కాదు కాబట్టి పెద్దగా వాడుకలో లేదు.
8. తలకోన
తిరుమలకు చేరుకోవడానికి ఉన్న ఎనిమిదో దారి తలకోన నుంచి ఉంది. ఈ దారిలో వెళ్లాలంటే తలకోన జలపాతం దగ్గర నుంచి బయలుదేరి జండా పేట్ దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. ఏడుకొండలవాడిని చేరుకోవడానికి ఇన్ని దారులున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం! దారి ఏదైనా గమ్యం ఒకటే! అదే శ్రీనివాసుని దివ్య దర్శనం. ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుని కనులారా దర్శిద్దాం. దివ్యానుభూతిని పొందుదాం!
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

