Ganga Dussehra 2025 : జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. రామాయణం ప్రకారం ఇదే రోజు గంగావతరణం కూడా జరిగిందని శాస్త్రవచనం. ఈ సందర్భంగా చేసే గంగపూజ ఎంతో విశిష్టమైనది. జూన్ 5 వ తేదీ గంగావతరణం సందర్భంగా ఈ కథనంలో పరమ పవిత్రమైన గంగావతరణం ఘట్టాన్ని గురించి తెలుసుకుందాం.
సగరుల వంశ చరిత్ర
శ్రీరాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో కొన్ని తరాల కిందట సగర చక్రవర్తి ధర్మాత్ముడై అయోధ్యను పరిపాలిస్తుండేవాడు. సంతానం కోసం సగరుడు తన భార్యలతో కలిసి హిమాలయాలలో దీర్ఘకాలం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి సగరుడికి ఇద్దరు భార్యలలో ఒకరికి వంశాన్ని నిలిపే అసమంజసుడనే కొడుకు, ఇంకొకరికి అరవై వేల మంది కొడుకులు పుట్టేలా వరమిస్తాడు.
అశ్వమేధ యాగం
సగరుడు అశ్వమేధ యాగం తలపెట్టి సుముహూర్తంలో యాగం మొదలుపెట్టి యాగాశ్వాన్ని విడిచి పెడతాడు. యాగాశ్వానికి రక్షణగా తన మొదటి భార్య పుత్రుడైన అసమంజసుని కుమారుడు అంశుమంతుని పంపుతాడు.
యాగాశ్వాన్ని అపహరించిన దేవేంద్రుడు
కొద్దిరోజులకు దేవేంద్రుడు ఆ యాగాశ్వాన్ని అపహరిస్తాడు. యాగాశ్వం అపహరణకు గురికావడం అమంగళకరమని భావించిన సగరుడు యాగాశ్వాన్ని అపహరించిన వారిని సంహరించి అశ్వాన్ని తీసుకురమ్మని తన రెండవ భార్య పుత్రులైన అరవై వేలమంది పుత్రులను ఆదేశిస్తాడు.
సాగరాలు ఇలా పుట్టాయి
సగరులు యాగాశ్వం కోసం భూమి అంతా తమ గోర్లతో తవ్వేస్తారు. ఈ సందర్భంగానే సాగరాలు ఏర్పడ్డాయి. అలా తవ్వుతూ ఈశాన్య దిక్కున తవ్వేసరికి అక్కడ తపస్సు చేసుకుంటున్న కపిల ముని, యాగాశ్వం కనబడ్డాయి. యాగాశ్వం కనబడగానే సంతోషించి కపిల మునే యాగాశ్వాన్ని అపహరించాడని అనుకుంటారు. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే కపిల ముని అని తెలుసుకోలేని అజ్ఞానంతో కపిల మునిపై దండయాత్రకు దిగుతారు. కపిల ముని ఆగ్రహించి సగరులను బూడిద రాశులుగా మార్చేస్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక్కడ సగరుల జాడ తెలియక సగరుడు ఆందోళనతో అంశుమంతుని పంపుతాడు.
బూడిద రాసులుగా మారిన సగరులను గుర్తించిన అంశుమంతుడు
అంశుమంతుడు ఈశాన్యదిక్కుకు వెళ్లి తన పినతండ్రుల భస్మరాశులు, పక్కనే యాగాశ్వం కనిపిస్తుంది. దుఃఖంతో అంశుమంతుడు వారికి తర్పణం ఇవ్వడానికి నీటి కోసం వెతుకగా ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా కనబడదు. సగరులకు తర్పణం ఇవ్వడానికి అంశుమంతుడు గంగను భూమికి తీసుకురావడానికి నిర్ణయించుకుంటాడు.
గంగకోసం తపస్సు చేసి స్వర్గస్తుడైన అంశుమంతుడు
అంశుమంతుడు గంగకోసం తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లి, గంగ కోసం తీవ్రమైన తపస్సు చేసి శుష్కించి స్వర్గస్తుడవుతాడు. తరువాత అంశుమంతుని కుమారుడు దిలీపుడు కూడా గంగ కోసం కఠిన తపస్సు చేసి గంగను భూమిపైకి తీసుకురాలేక మనోవ్యధతో మరణిస్తాడు.
భగీరథుని తపస్సు
దిలీపుని కుమారుడు భగీరధుడు ఇతనికి సంతానం లేదు. తన తర్వాత వంశం ఆగిపోతే సగరులు తర్పణం ఇచ్చేవారు ఉండరన్న దిగులుతో భగీరధుడు ఎలాగైనా తానే గంగను భూమిపైకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి కఠిన తపస్సును మొదలు పెడతాడు. ఇతనికి సంతానం లేదు. తన తర్వాత వంశం ఆగిపోతే సగరులు తర్పణం ఇచ్చేవారు ఉండరన్న దిగులుతో భగీరధుడు ఎలాగైనా తానే గంగను భూమిపైకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి కఠిన తపస్సును మొదలు పెడతాడు.
భగీరథ ప్రయత్నం
భగీరథుని కఠిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు భగీరధుడు తన పితృదేవతలకు తర్పణం ఇవ్వడానికి గంగానది భూమిపై ప్రవహించేలా చేయమని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ గంగ భూమిపైకి వస్తే భరించగల సమర్ధుడు శివుడు మాత్రమే! కాబట్టి నువ్వు శివుని ప్రసన్నం చేసుకోమని చెబుతాడు.
శివుని కోసం భగీరథుని ఘోరతపస్సు
భగీరధుడు కాలి బొటనవ్రేళ్లపై నిలబడి పరమశివుని కోసం ఒక సంవత్సరం పాటు ఘోర తపస్సు చేస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓ భగీరథ! నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరుకున్నట్లే గంగను నా శిరస్సున నిలిపి నీ కోరిక తీరుస్తాను" అంటాడు. గంగ భూమిపైకి రావడానికి సర్వం సిద్ధమైంది. ఆ సమయంలో గంగ మనసులో కొంచెం గర్వించింది. 'నా ప్రవాహవేగాన్ని చూపించి పరమశివుని కూడా నా ప్రవాహంతో తీసుకుకెళ్తాను' అని అనుకుంది.
శివుని జటాజూటంలో బందీగా మారిన గంగ
అపరిమిత వేగంతో తన శిరస్సును దూకిన గంగ మనసులోని ఆలోచన పసిగట్టిన శివుడు తన జటలతో గంగను బంధించివేసాడు. ఆకాశం నుంచి భూమిపైకి వస్తుందనుకున్న గంగ శివుని జటాజూటంలోనే ఆగిపోయింది. ఎంత వేగం పెంచినా అక్కడే సుళ్లు తిరిగింది. ఒక్క చుక్క నీరు కూడా భూమిపైకి రాలేదు.
గంగావతరణం
జరిగిన పరిణామాలకు హతాశుడైన భగీరధుడు గంగను విడిచి పెట్టమని శివుని కోరుతూ మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. ప్రసన్నుడైన శివుడు జటలు సడలించి బిందుసరోవరం దగ్గర గంగను విడిచిపెట్టాడు.
ఫలించిన భగీరథ ప్రయత్నం - భువికి దిగిన గంగ
సహజంగానే పావని అయిన గంగ పరమశివుని స్పర్శతో మరింత పావనియై దివి నుంచి భువికి దిగుతుంటే ఆ గంగావతరణాన్ని చూడటానికి దేవతలు, గంధర్వులు, యక్ష కిన్నరులు ఆనందంగా ఆ ప్రవాహం వెంట నడిచారు. పరమపావని గంగా నదిని స్పర్శించి, స్నానం చేసి అందరు పునీతులయ్యారు. పరవళ్లు తొక్కుతూ గంగ కొన్ని సార్లు వేగంగా మరికొన్ని సార్లు మెల్లగా కొండల్లో లోయలు ఒంపులు తిరుగుతూ వయ్యారంగా ప్రవహించసాగింది.
జాహ్నవిగా గంగ
మార్గమధ్యంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని గర్వాధిక్యంతో గంగ ముంచెత్తగా కోపించి జహ్ను మహర్షి ఆ గంగను మొత్తం అవపోసన పట్టి తాగేస్తాడు. దేవతలు ఋషులు జహ్ను మహర్షిని గంగను విడిచి పెట్టమని ప్రార్ధించగా మహర్షికి గంగను విడిచి పెడతాడు. ఆనాటి నుంచి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది.
స్వర్గాన్ని చేరుకున్న సగరులు
భగీరథుని అనుసరిస్తూ బయలుదేరిన గంగ చివరకు పాతాళానికి చేరుకొని సగరులు బూడిద రాశులను పావనం చేసి వారికి సద్గతులు కల్పిస్తుంది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఓ భగీరథ! నీ కోరిక తీరింది. అరవై వేలమంది సగరులు పాప విముక్తులై స్వర్గాన్ని చేరుకున్నారు. వారి పేరుతో ఏర్పడిన సాగరాలలో జలాలు ఉన్నంత వరకు వారు స్వర్గంలోని ఉంటారు.
ఈ గంగావతరణం కథ విన్నా, చదివినా పాపాలు నశిస్తాయి. ధనం, యశస్సు, సంతానం కలుగుతాయి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.