Cinnamomum camphora : భగవంతునికి భక్తునికి మధ్య అగర్బత్తీ ఎంతమేరకు అనుసంధాన కర్తనో తెలియదుగానీ, కర్పూరం మాత్రం తప్పకుండా వారిద్దరి మధ్య వారధినే! ఎందుకంటే కర్పూరం లేనిదే "హారతి" లేదు. హిందూ దేవాలయాల్లో హారతి అంటే, కచ్చితంగా అది కర్పూరంతో వెలిగించినది మాత్రమే అయ్యుంటుంది! దేవుడికి సమర్పించిన తర్వాత భక్తులు కళ్లకు అద్దుకుంటేనే దర్శనం సంపూర్ణమైనట్టు లెక్క! మరి, అంతటి ముఖ్యమైన కర్పూరం మన ఇంటి పెరట్లో పెరిగితే ఎలా ఉంటుంది? అసలు కర్పూరం చెట్టు నుంచి తయారవుతుందని మీకు తెలుసా? "లేదు" అంటే మాత్రం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ హనుమాన్ జయంతి రోజున ఆ మొక్కను మీ ఇంటి ముందు పాదుకొల్పండి.
దేవుడు మేల్కొనేది కర్పూరంతోనే :
హిందూ సంప్రదాయంలో కర్పూరానికి ఉన్న విలువేంటో భక్తులు అందరికీ తెలుసు. పవళింపు సేవ తర్వాత శయనించే భగవంతుడు, బ్రహ్మ ముహూర్తంలో ఆలయం తలుపులు తెరుచుకున్న తర్వాత స్వామి నిండుగా మేల్కొనేది "కర్పూర హారతి"తోనే. అటు భక్తులు సైతం స్వామికి హారతిచ్చిన అనంతరం తాము స్వీకరిస్తేనే దేవుడి ఆశీస్సులు తమకు లభించినట్టుగా భావిస్తారు. ఈ విధంగా హారతికి మూలాధారమైన కర్పూరానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనదని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమారు చెబుతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ ఈ కర్పూరం కనిపించడం మనకు తెలిసిందే. అయితే ఇది ఒక చెట్టు నుంచి ఉత్పత్తి అవుతుందని మాత్రం చాలా మందికి తెలియదు!

భక్తుల మదిలో ప్రశాంతత :
కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే సువాసనతో భక్తుల మనసుల్లో ప్రశాంతత ఉద్భవిస్తుంది. భగవంతుని సన్నిధిలో ఉన్నామనే భావనకు, ఈ సువాసనతోడై మనశ్శాంతిని మరింతగా పెంచుతుంది. హృదయం నిర్మలంగా మారడంలో, మనలోని భక్తిభావాన్ని రెట్టింపు చేయడంలో సహాయ పడుతుంది. కర్పూర కాంతులతో పరిసరాలు కూడా ఎక్కడలేని పవిత్రతను ఆపాదించుకున్నట్టుగా మారిపోతాయి. హారతి వెలుగుతున్నంత సేపు భక్తులు స్వామిసేవలోనే మనసు లగ్నం చేస్తారంటే అతిశయోక్తి కాదు. భగవంతుని నిరాకార ఉనికికి సైతం "హారతి" ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. అందుకే, కర్పూరం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
ఆరోగ్యానికీ మేలే :
కర్పూరం దైవారాధనకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సువాసనతో మనసును ఉల్లాసపరచడమే కాదు, శరారీకంగా ఎదురయ్యే ఇబ్బందులనూ పారదోలడంలో సహాయపడుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కర్పూరం ఆయిల్‌తో మర్దనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతారు. ఈ విషయాన్ని National Library of Medicine కూడా ప్రస్తావించింది. అంతేకాదు, కర్పూర వాసన పీల్చడం ద్వారా జలుబు, దగ్గు, ఇంకా శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఓ పరిశోధన పేర్కొంది.
చైనాలోని "Fujian Agriculture and Forestry University" ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశోధనలో 43 మంది హెల్దీ విద్యార్థులకు ఈ కర్పూరం ఆయిల్ వాసన చూపించి, వారి నాడీ వ్యవస్థపై అది ఎలాంటి ప్రభావం చూపుతోందో పరిశీలించారు. విచిత్రంగా డయాస్టొలిక్ ప్రెజర్ (DBP), పల్స్ రేటు తగ్గినట్టు గుర్తించారట. ఇంకా EEG, హై బీటా (AHB)లోనూ గణనీయమైన తగ్గుదల కనిపించిందట. మొత్తానికి కర్పూరం సువాసన మానసిక, శారీరక హాయిని ప్రోత్సహిస్తుందని ఫలితాలు సూచించాయట. ఈ విషయాన్ని వైద్య పరిశోధనలను ప్రచురించే Frontiers పేర్కొంది.

చెట్టు నుంచి ఉత్పత్తి :
ఇంతటి విశిష్టత కలిగిన కర్పూరం ఎలా తయారవుతుంది? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. అంతేకాదు, అదొక రసాయనం అని భావించేవారు కూడా ఉన్నారు. కానీ, కర్పూరం స్వచ్ఛంగా చెట్టునుంచి ఉత్పత్తి అవుతుంది. ఆ చెట్టు శాస్త్రీయ నామం "Cinnamomum camphora". సుమారు 50 ఏళ్ల వయసున్న చెట్టు బెరడు, కలప ఇతర భాగాల ను సేకరించి, వాటిని పొడి రూపంలోకి మార్చుతారు. ఆ తర్వాత ఆవిరితో చర్య జరిపి, నూనెను సేకరించి, దాన్ని స్పటికంగా మార్చడం ద్వారా కర్పూరం బిళ్లలను తయారు చేస్తారు.
ఆ చెట్టు మీ ఇంట్లో పెంచితే? :
"అత్యంత గొప్పదైన కర్పూరం చెట్టును ఇంట్లో పెంచవచ్చా?" అంటే నిరభ్యంతరంగా పెంచవచ్చు. అయితే అది చాలా పెద్ద చెట్టుగా ఎదుగుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి, పెరట్లో కాస్త ఎక్కువగా ఉన్న ఖాళీ స్థలంలో పెంచవచ్చు. అంతేకాదు దానికి తేమతో కూడిన వేడి వాతావరణం కావాలి. చెట్టు వేర్లకు నిరంతరంగా నీళ్లు పెట్టాల్సిన పనిలేదుగానీ, తేమ ఉండేలా చూసుకోవాలి. చల్లటి వాతావరణంలో మాత్రం ఈ చెట్టు ఇమడలేదు. ఇక, కుండీల్లో పెంచాల్సి వస్తే పెద్ద కుండీని తీసుకోవాలి. చెట్టు ఎదుగుతున్నప్పుడు క్రమం తప్పకుండా కొమ్మలు కత్తిరిస్తూ ఉండాలి. ఆ కుండీ కూడా ఎండ ప్రదేశంలోనే ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు సూర్యరశ్మి తాకాల్సి ఉంటుంది.
ఎక్కడ్నుంచి తేవాలి?
కర్పూరం మొక్క నుంచి తయారవుతుందనే విషయమే చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని మనం పెంచడం సాధ్యమయ్యే పని కాదని మెజారిటీ జనం భావిస్తారు. కొందరికి పెంచాలని కోరిక ఉన్నప్పటికీ, అది ఎక్కడ దొరుకుతుందనేది తెలియదు. కానీ, వాస్తవం ఏమంటే ఈ మొక్క కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఆన్ లైన్లో మీకు ఈ ప్లాంట్ అందుబాటులో ఉంటుంది. అవును, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో ఈ కర్పూరం మొక్కలు విరివిగా లభిస్తాయి. ఒక్క క్లిక్‌తో నేరుగా మొక్కనే మన ఇంటికే డెలివరీ చేస్తారు. ఇంకా, దీని ధర కూడా మరీ ఎక్కువగా ఏమీ ఉండదు. 3 నుంచి 4 వందల రూపాయల మధ్యలో ఉంటుంది. విత్తనాలు లభించడం కాస్త కష్టం కావచ్చుగానీ, మొక్క వెంటనే దొరుకుతుంది.
మనం కర్పూరం తయారు చేయొచ్చా?
కర్పూరం చెట్టును ఇంట్లో పెంచుకోవడం సాధ్యమే అనగానే, ఇక నుంచి మనమే కర్పూరం తయారు చేసుకోవచ్చని అనుకుంటే పొరపాటే! ఈ చెట్టును మనం ఇంట్లో పెంచడం సాధ్యమేకానీ, నేరుగా కర్పూరం బిళ్లలను ఉత్పత్తి చేయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనేది పైన్నే చెప్పుకున్నాం. కర్పూరం చెట్టు భాగాలను సేకరించి, పొడిగా మార్చి, ఆవిరి ద్వారా నూనె సేకరించి, ఆ తర్వాత బిళ్లలను తయారు చేస్తారు. అదొక పెద్ద ప్రాసెస్. అయితే, అలాగని మనం కర్పూరం సువాసనను కోల్పోతామని భావించకండి. బిళ్లలను ఉత్పత్తి చేయలేకపోయినప్పటికీ కర్పూరం ప్రయోజనాలను భేషుగ్గా పొందవచ్చు.
కర్పూరం చెట్టు ఆకులను చేతిలోకి తీసుకొని కాస్త నలిపితే చాలు, సహజమైన కర్పూర పరిమళాలు వెదజల్లుతుంది. ఆ సువాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా, మనకు నచ్చినప్పుడల్లా ఆ సుగంధాన్ని ఆస్వాదించవచ్చు. ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఇన్ని విధాలుగా సహాయ పడడంతోపాటు మీ ఇంటికి ప్రత్యేక గుర్తింపును, ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఏ మాత్రం అవకాశం ఉన్నా హనుమాన్ జయంతి రోజు చెట్టును ఇంటికి తెచ్చే ప్రయత్నం చేయండి. లేదంటో మరో రోజైనా తెచ్చుకోండి. జస్ట్ ఆన్ లైన్లో ఒక క్లిక్ చేస్తే చాలు! మీ ఇల్లు కర్పూర చెట్టుతో కళకళలాడుతూ ఉంటుంది.
"రేపే 'హనుమాన్ జయంతి' - ఇలా పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ఉద్యోగ, ధన ప్రాప్తి ఖాయం!"