Sphatik Shivling Benefits : హిందూ ధర్మశాస్త్రంలో విగ్రహారాధన గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా శైవులు శివారాధన కోసం ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజ చేస్తుంటారు. సాధారణంగా శివలింగాలు రాతితో కానీ, లోహాలతో కానీ తయారు చేస్తుంటారు. అయితే శివలింగాలలో స్ఫటిక శివలింగానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సందర్భంగా స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? ఉంచుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? స్ఫటిక శివలింగాన్ని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తదితర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్వచ్ఛతకు ప్రతీక స్ఫటికం
స్పటికం స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఇంతటి స్వచ్ఛమైన స్ఫటికం సాక్షాత్తు పరమశివుని స్వరూపాన్ని సంతరించుకుంటే అది అపూర్వం. స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వాస్తు శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే శుభాలు, సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వాసం. ఈ సందర్భంగా అసలు ఇంట్లో స్ఫటిక లింగాన్ని ఉంచుకోవచ్చా? ఉంచుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం.
ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా?
శివారాధన చేసే వారు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా అని సందేహ పడుతుంటారు. ఆధ్యాత్మిక వేత్తలు, వాస్తు శాస్త్రం ఇంట్లో శివలింగాన్ని తప్పకుండా ఉంచుకోవచ్చని అంటున్నారు. అయితే ఇంట్లో ఉంచుకునే శివలింగ పరిమాణం మాత్రం బొటనవేలంత మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎత్తయిన శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వాస్తురీత్యా మంచిది కాదని అంటారు.
స్ఫటిక శివలింగం పూజించడానికి నియమాలేమిటి?
- బొటనవేలు కన్నా చిన్న పరిమాణంలో ఉన్న స్పటిక శివలింగాలు గృహారాధనకు చాలా శ్రేయస్కరం.
- స్ఫటిక శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీటితో నిత్యం అభిషేకం చేయాలి.
- అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి, ధూప, దీప, నైవేద్యాలు తప్పకుండా సమర్పించాలి.
- స్ఫటిక శివలింగాన్ని ఇంటి ఈశాన్య మూలలో కానీ, ఉత్తర దిశలో ఉంచి పూజించడం శుభప్రదం.
- స్ఫటికశివలింగాన్ని నేరుగా నేలపై ఉంచకుండా, చెక్క లేదా పాలరాతి పీఠంపై ఉంచాలి.
- ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని ఉంచినప్పుడు నిత్యం పూజించడం, అభిషేకం చేయటం ముఖ్యం.
- నిరంతరం శివలింగంపై జలధార పడేలా చూసుకోవడం ఉత్తమం.
- ఈ ప్రక్రియ శివలింగ శక్తిని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది.
స్ఫటిక శివలింగ పూజాఫలం
స్పటిక శివలింగాన్ని ఉంచి పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
- ఏ ఇంట్లో అయితే నిత్యం స్పటిక లింగానికి పూజ జరుగుతుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా వర్ధిల్లుతుందని విశ్వాసం.
- ప్రతిరోజూ స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం వలన ఆరోగ్యం, సంపద, మోక్షం లభిస్తాయని విశ్వాసం.
- స్పటిక లింగాన్ని పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. ఈ పూజ ప్రతికూల శక్తులను దూరం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం స్పటిక లింగ పూజ వివాహంలో ఆటంకాలు తొలగిస్తుందని తెలుస్తోంది.
- ప్రతిరోజూ స్పటిక లింగాన్ని అభిషేకించిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతారు.
- వ్యాపార స్థలంలో స్పటిక లింగాన్ని ఉంచి అభిషేక పూజలు నిర్వహిస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఆటంకాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాల పంట పండుతుంది.
- ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం స్పటిక లింగానికి పూజ జరుగుతుందో ఆ ఇంట కలహాలు ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ఐక్యత వృద్ధి చెందుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
స్ఫటిక లింగాన్ని ఎవరు పూజించాలి?
స్పటిక లింగాన్ని స్త్రీ పురుష వయో భేదం లేకుండా ఎవరైనా పూజించవచ్చు. స్ఫటిక శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. - ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.