ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోవాలా? ఈ 5 వస్తువులు తప్పక తొలగించాల్సిందే!
వాస్తు చెబుతోంది- ఇవి ఇంట్లో ఉంటే దరిద్రం వెంటాడుతుంది!

Published : September 20, 2025 at 5:30 AM IST
Negative Energy Remove From Home: తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు నుంచి పండుగలు ఎక్కువగా వస్తుంటాయి. వినాయకచవితి తర్వాత అతి పెద్ద పండుగలు దసరా, దీపావళి. సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2 తో ముగుస్తాయి. అలాగే అక్టోబర్ నెలలోనే దీపావళి పండుగ కూడా రానుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అతి ముఖ్యమైన ఈ రెండు పండుగలకు సిద్ధమయ్యే క్రమంలో ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకోవడం, ఇంటికి కొత్తగా రంగులు వేయించుకోవడం వంటివి చేస్తుంటాం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, అలాగే ప్రతికూల శక్తులను పారద్రోలడానికి ఇవన్నీ చేస్తాం. మరి మీ ఇంట్లో కూడా ప్రతికూల శక్తులు తొలగించుకోవాలని అనుకుంటున్నారా! అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
పండుగలు ఎందుకు జరుపుకుంటాం?
పండుగ పది గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు. అందుకే హిందూ సంప్రదాయం పండుగలకు పెద్ద పీట వేసింది. మన పురాణాల ప్రకారం కూడా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగానే మనం పండుగలు జరుపుకుంటాం. అంటే ఏమిటి అర్ధం? పండుగల సందర్భంగా పాతచెడు జ్ఞాపకాలను విడిచి పెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలి. అందుకే ప్రతిరోజూ మనం ఇల్లు శుభ్రపరచుకున్నా పండుగల సందర్భంగా ఇంటిని మరింతగా శుభ్రం చేసుకుని అందంగా అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటునే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. అందుకే లక్ష్మీదేవికి స్వాగతం పలికే ముందు మనం ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రతికూల శక్తులను బయట పడేద్దాం!
వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల సంపదకు ఆటంకం కలిగి, ప్రతికూల శక్తులు ఏర్పడతాయని నమ్ముతారు. నవరాత్రి సమయంలో వీటిని తొలగించడం వల్ల అదృష్టం, సంతోషం, శాంతి కలుగుతాయని విశ్వాసం. పనికిరాని, పాడైపోయిన వస్తువులతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ పండుగకు ఇల్లు శుభ్రం చేసుకునే ముందు పనికిరాని వస్తువులను బయట పడేద్దాం. ఈ సందర్భంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెంచే వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
పాత ఫోన్లు
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అందరికీ అవసరమే! మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ వస్తే పాత ఫోన్ పక్కన పడేస్తాం. వాడుతున్న ఫోన్ పాడై పోయినప్పుడు కూడా పక్కన పడేసి కొత్తది కొంటాం. ఇలా వాడకుండా ఉండే వస్తువుల వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఇలాంటి వాటిని అమ్మేయడం కానీ, లేదా వాటి అవసరం ఉన్నవారికి ఇవ్వడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులను తగ్గించినట్లు అవుతుంది.
పగిలిపోయిన అద్దాలు
ఇంట్లో ఉంచుకునే అద్దం లక్ష్మీ స్వరూపమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలాంటి అద్దం పగిలి పోయి ఉండడం మంచిది కాదు. అలాగే పగిలి పోయిన గాజు సీసాలు, జాడీలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగ సందర్భంగా నెగటివ్ ఎనర్జీ పెంచే ఈ పగిలిపోయిన అద్దాలు, సీసాలు బయట పడేసి కొత్త వాటితో భర్తీ చేయండి. మీ ఇంట్లో సానుకూల శక్తుల ప్రభావం అమాంతంగా పెరిగి పోతుంది.
విరిగిన విగ్రహాలు, పాడై పోయిన చిత్రపటాలు
దేవుని మందిరంలో విరిగిపోయిన దేవుని విగ్రహాలు, పాడై పోయిన చిత్ర పటాలు ఉంటే అవి ఇంటి శ్రేయస్సుకు ఆటంకంగా మారుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. విరిగిన దేవతా విగ్రహాలు లేదా చిరిగిన ఫోటోలను ఇంట్లో ఉంచడం అశుభకరంగా భావిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందడానికి వాటి స్థానంలో కొత్త విగ్రహాలు లేదా చిత్రపటాలను ఉంచడమే ఉత్తమ మార్గం.
చిరిగిన వస్త్రాలతో దరిద్రం
పండుగల సందర్భంగా కొత్త వస్త్రాలు కొనుక్కోవడం మన సంప్రదాయం. సాధారణంగా మనకు పండుగలు ఎక్కువే కాబట్టి బట్టలు కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాం. కానీ కొందరు పాతబడిన, చిరిగిపోయిన వస్త్రాలను వాడకుండా అలాగే పక్కన పెట్టేసి ఉంటారు. కానీ ఇంట్లో ఇలా చిరిగిపోయిన వస్త్రాలు ఉంటే దరిద్ర దేవతకు స్వాగతం పలికినట్లే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే పండుగల వేళ చిరిగిన వస్త్రాలు బయట పడేయడం మంచిది. అలాగే మనం వేసుకోకుండా పక్కన పెట్టేసిన వాటిని అవసరమైన వారికి ఇవ్వడం మంచిది.
పనిచేయని గడియారాలు
వాస్తు ప్రకారం, పనిచేయని గడియారాలు, ఇతర పరికరాలను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో, ఇంట్లో స్తబ్ధత పెరుగుతుంది. వృత్తి పరంగా పురోగతి లోపిస్తుంది. మీ ఇంట్లోని అన్ని గడియారాలు పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించి మరమ్మత్తు చేయడానికి వీలులేని వాటిని తీసివేయండి.
ఇంట్లో సుఖశాంతులు వెల్లి విరియాలన్నా, సిరిసంపదలతో అష్టైశ్వర్యాలతో ఇల్లు కళకళలాడుతుండాలన్నా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెంచే వస్తువులను బయట పడేసి, సానుకూల శక్తులతో మీ ఇంటిని నింపుకోండి. నిజానికి ఈ పని నెలకోసారి చేయడం మంచిది. అలా కుదరని వారు రానున్న పండుగల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. స్వచ్ఛమైన ఇంటిలోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సానుకూల శక్తులతో ఆ ఇంట్లో నివసించే వారు కూడా అభివృద్ధి చెందుతారు.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

