అయోధ్యలో అతి ప్రాచీన హనుమాన్ ఆలయం- మిస్ అయితే యాత్ర అసంపూర్ణమే!
అయోధ్య హనుమాన్ గఢీ ఆలయం ప్రత్యేకలు మీ కోసం!

Published : June 17, 2025 at 4:00 AM IST
Ayodhya Hanuman Garhi Temple : శ్రీరాముని జన్మభూమిగా భావించే అయోధ్యా నగరం ఇటు చారిత్రకంగాను, అటు ఆధ్యాత్మికంగా కూడా అతి ప్రాచీనమైనది. సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య నగరంలో ఏడాది క్రితం ప్రారంభమైన బాలరాముని ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. రాముని దర్శనం తరువాత అయోధ్యలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయం హనుమాన్ గఢీ ఆలయం. ఈ కథనంలో అతి ప్రాచీనమైన హనుమాన్ గఢీ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
రామమందిరంతో సమానమైన ఖ్యాతి
అయోధ్య రామమందిరంకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న పలు ఆలయాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి హనుమాన్ గఢీ. ఆసక్తి గొలిపే హనుమాన్ గఢీ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం.
నవాబులు నిర్మించిన ఆలయం
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయాన్ని ఆలయాన్ని నిర్మించింది నవాబులు. ఇదే అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం. 10వ శతాబ్దంలో నిర్మించిన హనుమాన్ గఢీ ఆలయ నిర్మాణంలో అప్పటి నవాబ్ సాహెబ్ కీలక పాత్ర పోషించారు. అయోధ్యలో ప్రధాన దేవుడైన రాముడితో పాటు హనుమంతుడిని దర్శించుకుంటేనే అయోధ్య సందర్శన సంపూర్ణం అవుతుందని భక్తుల విశ్వాసం.
ఆలయ చరిత్ర
చరిత్ర పుటలు తిరగేస్తే హనుమాన్ గఢీ ఆలయానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అయోధ్యలో హనుమంతునికి మొదటి ఆలయాన్ని విక్రమాదిత్య నిర్మించారు. అయితే ఈ పురాతన ఆలయం ధ్వంసంకావడంతో ప్రజలు ఈ స్థలాన్ని హనుమాన్ తిలా అని పిలవడం ప్రారంభించారు. లఖ్‌నవూను నవాబ్ మసూర్ అలీఖాన్ సఫ్దర్ జంగ్ సాహెబ్ పాలిస్తున్నప్పుడు ఈ స్థలంలో బాబా అభయ్ రాందాస్ జీ త్యాగి అనే మహాత్ముడు ఒక గుడిసెను నిర్మించుకుని నివసించేవాడని చరిత్ర చెబుతోంది. ఎంతో నిష్ణాతుడైన బాబా అభయ్ రాందాస్‌కు హనుమంతుడు దర్శనం కూడా ఇచ్చారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది.
క్షీణించిన నవాబ్ ఆరోగ్యం
ఒకసారి నవాబ్ మసూర్ అలీ సాహెబ్ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అతనికి పేరుగాంచిన వైద్యులు చికిత్స అందించారు. కానీ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇక ఎంతో మంది ముస్లిం ఫకీర్లు నవాబ్ ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు నిర్వహించారు, తాయెత్తులు కూడా కట్టినా ఫలితం దక్కలేదు.
హనుమాన్ అనుగ్రహంతో మెరుగుపడిన నవాబ్ ఆరోగ్యం
ఆ సమయంలో మహాత్మా అభయ్ రాంజీ నవాబును దర్శించారు. మహాత్మ అభయ్ రాంజీ వైద్య పరిజ్ఞానం ఉన్న సాధువు మాత్రమే కాదు అయోధ్యలో పూజలు నిర్వహించే పూజారి కూడా. ఇక నవాబ్ సాహెబ్‌ను చూసి అభయ్ రాంజీ హనుమాన్ పేరిట చేసిన పూజ చేసిన పవిత్ర జలాన్ని ఔషధంగా ఇచ్చారు. ఆ ఔషధం సేవించగానే నవాబ్ సాహెబ్ అనారోగ్యం నుంచి కోలుకున్నాడట.
హనుమాన్ గఢీ ఇలా ప్రసిద్ధి చెందింది
నవాబ్ సాహెబ్ హనుమాన్ గఢీ ఆలయం నుంచి వచ్చిన పవిత్ర జలం తనను తిరిగి మామూలు మనిషి చేయడంతో వెంటనే హనుమాన్ తిల మీద హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని ప్రస్తుతం హనుమాన్ గఢీ అని పిలుస్తున్నారు.
ఏడాది పొడుగునా భక్తుల రద్దీ
హనుమాన్ గఢీ ఆలయంలో ఏడాది పొడవునా భక్తుల ప్రవాహం ఉంటుంది. హనుమంతుడు ఇక్కడ వెండి ఛత్రం కింద ఉంటాడు. హనుమంతుడు ఎల్లప్పుడూ పూలతో కప్పబడి ఉంటాడు. హనుమాన్ గఢీ ఆలయంలో హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి భక్తులు దాదాపు 76 మెట్లు ఎక్కాలి.
ఆకట్టుకునే హనుమాన్ విగ్రహం
గర్భాలయంలో హనుమానుతుని విగ్రహం చూపరులను కట్టిపడేస్తుంది. గర్భాలయంలో తల్లి అంజనాదేవి ఒడిలో బాలుని రూపంలో ఉన్న హనుమ దర్శనం అత్యంత శుభప్రదం. హనుమ మెడలో రాముని పేరు చెక్కిన తులసీదళాల దండ ఉంటుంది. అలాగే ఆలయ గోడలపై హనుమాన్ చాలీసా శ్లోకాలు కూడా చెక్కి ఉండడం గమనించవచ్చు.
విజయాన్ని కలిగించే విజయ స్తంభం
హనుమ గఢీ ఆలయంలో విజయస్థంభాన్ని దర్శించి నమస్కరించుకుంటే ఎంత క్లిష్టమైన కార్యంలో అయినా విజయం సిద్ధిస్తుందని విశ్వాసం.
పూజోత్సవాలు
నిత్యం భక్తుల రద్దీతో సందడిగా ఉండే హనుమాన్ గఢీ ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం భక్తుల రద్దీ రెట్టింపవుతుంది. ఇక శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి వంటి విశేష పర్వదినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజోత్సవాలు జరుగుతాయి.
అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్లిన వారు తప్పకుండా హనుమాన్ గఢీ ఆలయాన్ని కూడా దర్శింస్తుంటారు. అలా కాకుంటే వారి యాత్ర అసంపూర్ణమని భావిస్తారు.
మనం కూడా అయోధ్య యాత్రకు వెళ్లినప్పుడు హనుమ గఢీ ఆలయాన్ని కూడా దర్శిద్దాం. సకల విజయాలు పొందుదాం.
జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

