Sunday Remedies : ఆదివారం అంటేనే ఆటవిడుపు. ఎందుకంటే అది సెలవు రోజు. అయితే ఆదివారం సెలవు దినం మాత్రమే కాదు ఆరోగ్య వారం కూడా. అదేంటి వారానికి ఉన్న ఏడు రోజుల్లో ఈ ఆరోగ్య వారం ఎక్కడ నుంచి వచ్చిందని అనుకుంటున్నారా! ఆదివారాన్నే ఆరోగ్య వారమని పెద్దలు అంటారు. ఎందుకిలా అంటారు? అసలు ఆదివారానికి ఆరోగ్యానికి సంబంధమేమిటి? ఈ ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆరోగ్యం భాస్కరాదిత్యేత్!
హిందూ సంప్రదాయం ప్రకారం, ఆదివారం రోజు సూర్య భగవానుని ప్రధానంగా ఆరాధిస్తాము. ఆదిత్యుడు అంటే ఆది దేవుడు, తొలి దేవుడు అని అర్థం. ఈ ఆది దేవుని ఆరాధనకు ఆదివారం ప్రధానం. ఈ రకంగా సూర్యుని ఆరాధనకు ఆదివారం విశిష్టమైనది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు కదా! ఆదిత్యుని పూజించుకోవడానికి ఆదివారం శ్రేష్ఠమైనదిగా పెద్దలు నిర్ణయించారు.
ఆదివారం ఈ తప్పులు చేస్తున్నారా!
మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవనశైలి ఎంత అవసరమో, ఆరోగ్య ప్రదాత సూర్యుని ఆదివారం పూజించుకోవడం కూడా అంతే అవసరం. అందుకే ఆదివారం కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది.
వేకువఝామున మేల్కొనడం ఆరోగ్యం
మిగిలిన రోజులన్నీ ఎలా ఉన్నా, ఆదివారం సెలవు కదా అని బద్దకించకుండా వేకువ ఝామునే నిద్ర లేవాలని శాస్త్రం చెబుతోంది.
సూర్యోదయం తర్వాత దంతధావనం నిషిద్ధం!
సూర్యోదయం తర్వాత దంతధావనం చేయరాదు. దానికి ఒక కారణం ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి అవమానింపబడి యాగాగ్నికి ఆహుతి అయిన తరువాత ఆగ్రహోదగ్రుడైన పరమశివుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు అకారణంగా నవ్విన సూర్యుని పరమశివుడు దండిస్తాడు. ఆ సమయంలో సూర్యుని పళ్ళు ఊడిపోతాయి. అందుకే సూర్యునికి పళ్ళు ఉండవంట! సూర్యునికి మెత్తని పాయసం నివేదించడం వెనుక ఉన్న రహస్యం ఇదే! అప్పటి నుంచి సూర్యోదయం తర్వాత పళ్ళు తోముకుంటే సూర్యుడు తనను గేలి చేసినట్లుగా భావించి ఆగ్రహిస్తాడంట. సూర్యుడు ఆగ్రహిస్తే అనారోగ్యాలు చుట్టు ముడతాయని తెలిసిందే కదా! కాబట్టి సూర్యోదయం ముందే పళ్ళు తోముకోవాలని పెద్దలు చెబుతారు. ఇది ప్రధాన ఆరోగ్య రహస్యం. ఆదివారం సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన విషయం.
ఆదివారం ఈ తప్పులు చేయకండి!
మంచి ఆరోగ్యం కోసం ఆదివారం సూర్యుని ఆరాధించే వారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం.
- ఆదివారం మద్య, మాంసాలు తీసుకోరాదు.
- భోజనంలో ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం.
- ఆదివారం బ్రహ్మచర్యం పాటించాలి.
- ఆదివారం తలంటుకొని స్నానం చేస్తే ఆయుః క్షీణమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆదివారం తలకు నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు.
ఈ పరిహారాలతో మంచి ఆరోగ్యం
ఆదివారం సూర్యుని ఉపాసన చేసేవారు వేకువనే నిద్ర లేచి, తలారా స్నానం చేసి సూర్యునికి నమస్కరించి, ఆదిత్య హృదయం పఠించి, సూర్యభగవానునికి పాయసాన్ని నివేదించాలి. ఇలా నియమానుసారం ప్రతి ఆదివారం చేసినట్లయితే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని శాస్త్ర వచనం.
ఈ దానాలు శ్రేష్ఠం!
ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది. అలాగే తొమ్మిది ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు గోవుకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి.
మంచి జీవనశైలి - మంచి ఆరోగ్యం
సహజంగా ఆదివారం అంటేనే బద్ధకంగా ఉంటుంది. రోజూ చేసే పనులు కూడా సమయానికి చేయం. ఈ జీవనశైలి మార్పులతో చిన్న వయసులోనే ఎన్నో అనారోగ్యాలు. మన పూర్వీకులు శాస్త్రంలో చెప్పినట్లు పాటించడం వల్లనే ఎలాంటి అనారోగ్యం లేకుండా నిండు నూరేళ్లు హాయిగా జీవించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
మన పెద్దలు ఏది నిర్ణయించినా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. అందుకే ఆదివారం కదా అని బద్దకించకుండా కొన్ని నియమాలు పాటిస్తే, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం- ఆనందానికి ఆనందం! నిజానికి శాస్త్రీయ పరంగా చూసినా వేకువఝామునే నిద్ర లేవడం, భగవదారాధన పేరుతో సూర్య నమస్కారాలు చేయడం కూడా యోగాలో ఒక భాగమే! సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్-డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. అందుకే సూర్యుని ఆరాధన ప్రధానంగా మన జీవనశైలిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడం మంచిదని శాస్త్రకారులు చెబుతున్నారు. - శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.