Apara Ekadashi May 2025 : హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశిగా జరుపుకోనున్న సందర్భంగా అపర ఏకాదశి విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అపర ఏకాదశి ఎప్పుడు?
మే 23వ తేదీ శుక్రవారం, వైశాఖ బహుళ ఏకాదశిని అపార ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం. ఏకాదశి తిథి ప్రధానంగా విష్ణుమూర్తి పూజకు శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన వామనవతారాన్ని ఈ అపర ఏకాదశి రోజు పూజించాలని శాస్త్రం చెబుతోంది.
అపర ఏకాదశి రోజు వామన పూజ ఎలా చేయాలి?
అపర ఏకాదశి రోజు కుదిరిన వారు గంగా స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి. అనంతరం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వామనావతారంను తులసి దళాలతో అర్చించాలి. విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. చామంతులు, మల్లెలతో అర్చన చేయాలి. తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ, పంచామృతం, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. శ్రీహరి వామనావతారంను స్మరిస్తూ ఈ రోజు బ్రాహ్మణ బ్రహ్మచారులకు నూతన వస్త్రాలు, పాదుకలు, ఛత్రం సమర్పించడం శ్రేయస్కరమని శాస్త్రం చెబుతోంది.
అన్నదానం మహా పుణ్యం
అపర ఏకాదశి రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అలాగే విష్ణుమూర్తి ప్రీతి కోసం అన్నార్తులందరికి అన్నదానం చేయవచ్చు. వేసవి తీవ్రత అధికంగా ఉండే అపర ఏకాదశి రోజు ఉపవాసం చేసేవారు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు వంటివి అందించాలి. ఇలా చేయడం వలన ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా పది జన్మల పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు జలదానం వలన పితృదేవతలు కూడా సంతోషించి వంశాభివృద్ధిని కలుగజేస్తారని పెద్దలు చెబుతారు.
ఉపవాస నియమాలు
అపర ఏకాదశి రోజు ఉపవాసం చేసేవారు సూర్యోదయం నుంచి ఎలాంటి ఆహరం తీసుకోకూడదు. పగలంతా ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం తిరిగి ఇంట్లో దేవుని ఎదుట కానీ, దేవాలయంలో కానీ దీపారాధన చేసి, నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు. ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఏకాదశి ఉపవాసంలో నిషిద్ధం.
ఏకాదశి జాగరణ
ఏకాదశి రోజు జాగారానికి విశేషమైన ఫలితం ఉంటుంది. జాగరణ అనే పదానికి జాగృతం అంటే మెలకువగా ఉండడం అని అర్థం. ఏకాదశి జాగారం చేసే సమయంలో ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి శ్రీమన్నారాయణుని కథలు, భజనలు, నామ సంకీర్తనలతో కాలక్షేపం చేయాలి. ఇలా చేయలేని వారు జాగారం ఉండకపోవడమే మంచిది.
ద్వాదశి పారణ
మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసుకొని శ్రీమన్నారాయణునికి ఏకాదశి ఉపవాసం చేసే శక్తిని ప్రసాదించినందుకు భక్తితో కృతజ్ఞతతో నమస్కరించి యధాశక్తి పూజాదికాలు ముగించి ఒక అతిథికి భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి. ఏకాదశి ఉపవాసం చేసిన వారు అతిథికి భోజనం పెట్టకుండా తింటే ఏకాదశి వ్రత ఫలం దక్కదని శాస్త్ర వచనం.
ఏకాదశి ఉపవాసంలో ఇవి నిషిద్ధం
ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు. మద్యపానం నిషిద్ధం. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ ఏకాదశి ఉపవాసం చేసిన వారికి శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలా
అపర ఏకాదశిని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకొంటారు. దక్షయజ్ఞంలో పరమ శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నిప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టిస్తాడు. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి పూజ విశేషంగా జరుగుతుంది.
భక్తులకు శాంతమూర్తి
దుష్టసంహారం చేసే భద్రకాళి తన భక్తులకు మాత్రం శాంతమూర్తే! అందుకే అపర ఏకాదశి రోజు ఈ తల్లిని పూజిస్తే మనల్ని కమ్ముకొని ఉన్న అజ్ఞానమనే మాయ పొర తొలగిపోయి జ్ఞాన సంపద కలుగుతుందని విశ్వాసం.
విష్ణు ఉవాచ
చివరగా అపర ఏకాదశి రోజున ఎవరైతే తనను నిష్ఠగా పూజిస్తారో వారి పాపాలన్నీ అగ్నికి ఆహుతియైన దూది పింజల్లాగ నశించిపోతాయని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే పలికినట్లుగా శాస్త్రం చెబుతోంది.
ఈ అపర ఏకాదశి రోజు మనం కూడా ఆ విష్ణుమూర్తిని పూజించి మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
అమలక ఏకాదశి వ్రత కథ- ఒక్కసారి వింటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం తథ్యం!
శ్రీరాముడు ఆచరించిన 'విజయ ఏకాదశి' వ్రతం- ఈ కథ చదివినా, విన్నా కోరిన కోర్కెలు తీరడం తథ్యం!