MLA Complaint on Konda Couple : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుమంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు. ఈ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులకు, అక్కడి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు మరింత పెరగడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మీనాక్షి కార్యాలయానికి వచ్చి కలిశారు.
కొండా దంపతులపై ఫిర్యాదు : కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. వారి వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా తెలిపారు. రాష్ట్రస్థాయి కీలక నేతలపై కూడా లెక్కలేనట్లుగా వారు(కొండా దంపతులు) వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున హస్తం పార్టీకి తీరని నష్టం కలుగుతోందని జిల్లా నేతలు ఉదాహరణలతో సహా మీనాక్షికి చెప్పినట్లు సమాచారం. తనకు అన్ని విషయాలు తెలుసన్న ఆమె, విచారణకు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు. పార్టీలో విభేదాలుంటే అంతర్గత వేదికలపై చెప్పాలని, మీడియా ముందు ఎవరూ మాట్లాడవద్దని మీనాక్షి గట్టిగా హెచ్చరించినట్లు నేతలు తెలిపారు. ఆమె సూచనలతో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం : ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవిని తన కార్యాలయానికి పిలిపించి మీనాక్షి చర్చించారు. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైనా ఆమె వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించవద్దని, విచారణ జరిపి నివేదికలను ఇవ్వాలని మీనాక్షి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అధిక స్థానాలు నెగ్గాలి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో నెగ్గేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. ఈ ఎన్నికలపై పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఛైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదివారం జరిగింది. ఇందులో మీనాక్షి నటరాజన్, సంఘటన్ జాతీయ అధ్యక్షుడు సునీల్ పన్వర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో సంఘటన్ కీలకపాత్ర పోషించాలని ఆమె స్పష్టం చేశారు.
నేను అలా అనలేదు - నా మాటలను వక్రీకరిస్తున్నారు : మంత్రి కొండా సురేఖ
వారి వల్లే కేసీఆర్, కేటీఆర్‌లు నాశనం అయ్యారు : కొండా సురేఖ భర్త సంచలన వ్యాఖ్యలు