Pawan Kalyans Wife Anna Lezhneva Visits Tirumala: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ క్షేత్రస్థాయి సంప్రదాయాలను పాటిస్తూ అన్నాలెజినోవా వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారి హరింద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లిన అన్నాలెజినోవా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళం: దర్శన అనంతరం అన్నాలెజినోవాకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అన్నాలెజినోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని గాయత్రి నిలయం అతిథి గృహానికి బయలుదేరారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రానికి అన్నాలెజినోవా చేరుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒకపూట మధ్యాహ్నం అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.17 లక్షలు అందజేశారు.
కాగా శ్రీవారి దర్శనార్థం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకుని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయాన్ని పాటిస్తూ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అన్నాలెజినోవా ఆదివారం రాత్రి తిరుమలలోనే బస చేశారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Pawan Kalyan With Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు వైద్యం అందించారు. సింగపూర్‌లోని రివర్ వ్యాలీ ప్రాంతంలో టమాటో కుకింగ్ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సింగపూర్ ఆసుపత్రిలో అయిదు రోజుల పాటు వైద్య సేవలు పొందిన అనంతరం శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, తన కుమారుడు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు.
తిరుమలలో పవన్ సతీమణి అన్నాలెజినోవా - శ్రీవారికి తలనీలాలు సమర్పణ