N Goutham Rao is the BJP MLC Candidate for Hyderabad Local Bodies : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. మార్చి 28న నోటిఫికేషన్ విడుదల అయింది. నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుసింది. ఈ తరుణంలో హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్రావును అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఎంఐఎం తరపున రెండోసారి మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ వేశారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో మజ్లిస్ ఏకగ్రీవం అవుతుందని భావించిన సమయంలో బీజేపీ పోటీలోకి దిగడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్ 29నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1న ముగియనుండటంతో ఎన్నికకు ఈసీ షెడ్యూలు విడుదల చేసింది.
ఎమ్మెల్యే రాాజాసింగ్ ఆగ్రహం : బీజేపీ హైదరాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్ రావును ప్రకటించడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ పరోక్ష విమర్శలు చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గానికే అన్ని పదవులూ ఇస్తారా? మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసేవారికే పదవులు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మిగతావారు మీ గులాంగిరి చేయరు కదా అందుకే వారిని పక్కన పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీలో ఉన్న పెద్ద నాయకుడు మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ తుడిచే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు, టికెట్లు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల