Rajagopal Reddy Comments On Ministerial Post : మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ నా మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. మహాభారతంలో ధర్మరాజులాగా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి వారు ప్రస్తుతం ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి అడ్డుతగలడం చూసి చాలా బాధగా ఉందన్నారు.
గెలిపించే సత్తా : ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పార్లమెంట్ సీట్లను గెలిపించే బాధ్యతను మంత్రులకు ఇస్తే, భువనగిరికి మాత్రం ఎమ్మెల్యేనైనా తనను ఇంఛార్జ్‌గా పెట్టారని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. లోక్‌సభ స్థానాన్ని గెలిపించే సత్తా లేకుంటే నన్ను ఎందుకు ఇంఛార్జ్‌గా పెడతారని ప్రశ్నించారు. భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందన్నారు.
ఇప్పుడు గుర్తుకొచ్చిందా? : కాంగ్రెస్ పార్టీలో పదవులను నిజాయతీగా, సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులకే ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పదవుల కోసం లాబియింగ్ చేసే వారిని పక్కన పెట్టాలని, కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే యువకులను రాజకీయాలల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. తాను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండనని, మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదన్నారు. జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవించారని, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.
"మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నా మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారు. జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నేను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండను. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు" -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
కేసీఆర్‌ను గద్దెదింపాలనే : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదింపాలని లక్ష్యంతోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని, దాని ప్రకారమే కేసీఆర్‌ను గద్దె దింపినట్లు చెప్పారు. అది తన కమిట్మెంట్ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొన్ని కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని బీజేపీలో చేరానని, కానీ ప్రజల కోరిక మేరకు ప్రజాస్వామ్యం తరఫున పోరాడటానికి మళ్లీ తిరిగి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన శక్తివంచన లేకుండా పనిచేసినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం దోపిడీ, కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం : రాజగోపాల్ రెడ్డి