Miss World Competitions 2025 in Hyderabad : హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడ పర్యాటకానికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలిపి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పోటీల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. మే నెలలో జరగనున్న పోటీల నిర్వహణకు సకల ఏర్పాట్లు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా, మిస్ వరల్డ్ నిర్వాహకులు సైతం హాజరుకావటం విశేషం.
మిస్ వరల్డ్ ఈ పేరు చెబితే చాలు అందరి కళ్లు ఒక్కసారి తారల్లా మెరుస్తాయి. ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి చూపే బ్యూటీ పేజెంట్లలో మిస్ వరల్డ్ది ప్రత్యేక స్థానం. అలాంటి పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. తెలంగాణ జరూర్ ఆనా పేరుతో 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఘన స్వాగతం పలికిన పర్యాటక శాఖ : ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ, ఛైర్మన్ జూలియా మోర్లే, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మిస్ వరల్డ్ క్రిస్టినా, పోటీల నిర్వాహకులకు తెలంగాణ పర్యాటక శాఖ తరపున ఘన స్వాగతం పలికారు.
సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలతో మంగళహారతి, తిలకం అందించారు. అనంతరం సన్నాయి మేళాలతో వేదిక వద్దకు ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా చేనేత మగ్గాలు, హస్త కళా ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు మే 7వ తేదీ నుంచి 31 వరకు తెలంగాణ వేదికగా జరగనున్న పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
ప్రపంచానికి చాటుతాం : ఇందుకోసం దాదాపు రూ.54 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్న ఆయన అందులో సగానికి పైగా ప్రమోటర్ల నుంచి సేకరించనున్నట్టు వివరించారు. పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక రంగ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతామని వివరించారు.
మే 7వతేదీ నుంచి 31వ తేదీ వరకు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి యువతులు పాల్గొనున్నారు. మార్చి 6,7వ తేదీల్లో హైదరాబాద్ చేరుకోనున్న పోటీదారులకు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలకనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 10వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ప్రోరంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జానపద నృత్య కళాకారులతో భారీ పరేడ్ ని నిర్వహించనుంది.
ముత్యాలతో ఫ్యాషన్ షో : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారు బుద్ధవనం, చార్మినార్, రామప్ప వంటి ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు తెలిపింది. తెలంగాణ చేనేతను, మెడికల్ టూరిజం, ఇక్కడ ఆహారం వంటి వాటిని ప్రత్యేకంగా మిస్ వరల్డ్ పోటీదారులకు పరిచయం చేస్తామని తెలిపిన సర్కారు హైదరాబాద్లో అత్యంత పేరుగాంచిన ముత్యాలతో ఓ రోజు ఫ్యాషన్ షో నిర్వహించనున్నట్టు వివరించింది. ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలంగాణలో పర్యటించంటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
చీరకట్టుతో వచ్చిన ప్రపంచ సుందరి : అచ్చ తెలుగింటి ఆడపడుచులా చీరకట్టుతో మీడియా సమావేశానికి హాజరైన క్రిస్టినా అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. యాదాద్రి ఆలయ సందర్శన తనకు ఎంతో సంతోషానిచ్చిందన్న క్రిస్టినా భారతదేశం ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని తన హృదయంలో, తన జీవిత ప్రయాణంలో భారత్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లే మోట్లాడుతూ తెలంగాణలో పోటీలు నిర్వహించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు - అట్టహాసంగా జరగనున్న వేడుకలు
యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ - శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు