KTR Tweet on IT Exports in Telangana : తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను ఆయన ట్వీట్ చేశారు. 2022-23 సంవత్సరంలో తెలంగాణ నుంచి రూ.57,706 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే, 2023-24 కాలానికి రూ.26,948 కోట్ల ఎగుమతులే జరిగాయని తెలిపారు. ఐటీ ఉద్యోగ నియామకాలు కూడా భారీగా పడిపోయాయని, 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే, 2023-24లో కేవలం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఆరేడేళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్‌ను దేశానికి ఐటీ కేంద్రంగా చేసేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఐటీ రంగం ఎంతో మేలు చేసిందని గుర్తు చేసిన ఆయన, ఐటీ రంగాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
శాంతిభద్రతలు కఠినంగా అమలు చేయాలి : ఐటీతో పాటు ఐటీఈఎస్ రంగాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మళ్లీ నగరంలో ఐటీ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని, ఐటీ రంగానికి ఉపయోగపడే విధానాలు తేవాలని కోరారు. ఐటీ సంస్థలు మరిన్ని పెరగాలంటే ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు శాంతిభద్రతలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు.