KCR in Telangana Bhavan : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ 24వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవాలకు సిద్ధమైన వేళ చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు గులాబీ అధినేత దిశానిర్దేశం చేశారు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని అభివర్ణించిన ఆయన, రాష్ట్రాన్ని సాధించిన ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ఠపరచాలని, ఏడాదిపాటు రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించిన కేసీఆర్ తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామక్రమాన్ని వివరించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్ అని, అందుకే వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది పొడవునా నిర్వహించనున్న రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని గులాబీ అధినేత అన్నారు. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
అక్టోబర్, నవంబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక : ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధులతో సన్నాహాక సమావేశం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు, ఆ తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్, నవంబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని వివరించారు. రజతోత్సవాల్లో భాగంగా పార్టీ ప్రస్థానం, ఉద్యమ పోరాటం, పదేళ్ల పాలనా విజయాలపై డాక్యుమెంటరీలు, రచనలు చేయాలని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ గెలవకపోవడం రాష్ట్రానికి నష్టం : ప్రభుత్వపాలనపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతీపాలన కొనసాగుతోందని అన్నారు. ఇంకా పార్టీ శ్రేణులు తొందర పడవద్దని ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని చెప్పారు. మంత్రులు మాట వినడం లేదని, ఐఏఎస్ అధికారులు పనిచేయట్లేదని ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారా అని ఆక్షేపించారు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలున్న రాష్ట్రానికి రూపాయి రాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలవకపోవడంతో రాష్ట్రానికి ఏం నష్టం జరిగిందో ప్రజలకు అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.
ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం : బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఇప్పుడు తగ్గుతోందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. అధికారులను అడిగేవారు, వారికి చెప్పేవారు లేని పరిస్థితి నెలకొందని ఇదే అధికారులతో తమ పాలనలో అద్భుతాలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలకు నచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అచ్చి రాలేదని అనిపిస్తోందని సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లో గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ జోస్యం చెప్పారు. మహిళా రిజర్వేషన్లు వస్తాయి, పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు అవకాశాలు పెరుగుతాయి, సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు.
నేతల నుంచి అభిప్రాయాలు సేకరణ : ఈ సమావేశంలో సుధీర్ఘంగా ప్రసంగించిన కేసీఆర్ ఆ తర్వాత నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. శిక్షణా శిబిరాలు నిర్వహించాలని, పదేళ్లలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలకు సమయం ఉందన్న నిర్లిప్తతను వీడి, నేతలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, సంస్థాగత కమిటీలు పటిష్ఠంగా జరగాలని పలువురు నేతలు తెలిపారు. నేతలు, కార్యకర్తలను తరచూ కలవాలని కొందరు కేసీఆర్‌కు సూచించారు. ఇక నుంచి నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతానని తెలిపారు. వారంరోజుల్లో ముఖ్యనేతలైన 30, 40 మందితో సమావేశమై కార్యాచరణ, కమిటీలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని ప్రజా ఉత్సవంగా జరుపుతాం : కేటీఆర్
7 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్ - ఇవాళే బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం