Congress Activists Fight infront Of Sharmila: కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం రానుందని, అందరూ కష్టపడాల్సిన సమయం వచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జిల్లా పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, సమన్వయ కర్తల మధ్య షర్మిల ఎదుటనే పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది.
నియోజకవర్గ సమన్వయకర్తలు కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజల్లో తిరగడం లేదని, ప్రజా సమస్యలపై స్పందించడం లేదని నాయకులు ద్వజమెత్తారు. ఇంకా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సమన్వయకర్తలు సహకరించకపోగా, ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితులు లేవని వాదనకు దిగారు. పార్టీ సమన్వయకర్తలను మార్పకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడకే కష్టమని అన్నారు. ఈ విషయం షర్మిల గ్రహించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రెండు గంటలసేపు గొడవ: గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమన్వయ కర్తలు ప్రభాకర్, రాంభూపాల్లను మార్చాలని ఆ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిల ఎదుటనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు, బౌన్సర్లు సమావేశం హాలులోకి వచ్చి నాయకులకు నచ్చజెప్పి శాంతింప చేశారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, 2 గంటలసేపు గొడవ పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని, ఈ సమయంలో అందరూ కష్టపడితే మళ్లీ అధికారం మనదేనని వైఎస్ షర్మిల పార్టీ శ్రేణులను ఉద్దేశించి చెప్పారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకునే వరకు, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలు, నాయకులు శ్రమించాలని షర్మిల దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని, కనీసం పింఛన్ అడిగినవారికి కూడా ఇవ్వలేకపోతోందని షర్మిల విమర్శించారు. పింఛన్ జాబితాలో నుంచి అర్హులను తొలగిస్తున్నారని, వీటిపై క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పాల్సిన అవసరం ఉందని షర్మిల చెప్పారు.
అమరావతి మహిళలకు భారతీరెడ్డి, జగన్ క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల
తన తప్పులేదంటున్న జగన్ విచారణ చేయాలని ఎందుకు చెప్పట్లేదు: వైఎస్ షర్మిల