CM Chandrababu on TDP Cadre : ఎన్టీఆర్ జిల్లా ముపాళ్లలో టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ఉత్తమ నియోజకవర్గాల్లో నందిగామ ఒకటని చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తు చేశారు. అందుకు పార్టీ నేతల మధ్య సమన్వయం లోపం కారణమని చెప్పారు. కానీ మిగతా సార్లు విజయం సాధించినట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకుని రోడ్డుపైకి వస్తే టీడీపీకి తిరుగులేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 70 నుంచి 75 మార్కెట్ యార్డు కమిటీల నియామకం పూర్తయిందని మిగిలిన వాటికి త్వరలోనే నియామకాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించామని, త్వరలోనే సోసైటీలకు పాలకవర్గాలను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఏడాది శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్, బూతు వారీగా నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తున్నట్లు వివరించారు. అందుకనగుణంగా వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో పాటు గుర్తింపు ఇస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు.
నేను టీడీపీ శాశ్వత పార్టీగా ఉండాలనే తపనతో పనిచేస్తున్నాను. పనిచేయని నేతలను పక్కన పెట్టి కొత్తవారిని తయారు చేస్తాను. ఎన్నికల సమయంలో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తాం. లేకపోతే వారిని పక్కన పెడతాం. ఇకపై పార్టీలో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఎందుకు ఇచ్చామో కూడా తెలియజేస్తాం. రాజకీయ నాయకులుగా ఎదగాలంటే వారిలో నాయకత్వ లక్షణాలు ఉండాలి. అదేవిధంగా ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉండాలి. - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'వచ్చే మహానాడును వైఎస్సార్ కడపలో ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్‌లో కడపలో ఘనవిజయం సాధిస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్వారానే పనులు చేస్తాం. ప్రజలకు మంచి జరిగేలా పనులు చేయాలి. టీడీపీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులపై ఉన్న కేసులను న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించి తొలగిస్తాం. 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ పనిచేయాలి. దాని కోసం ఇప్పటినుంచి అందరూ కష్టపడి పనిచేయాలి' అని చంద్రబాబు సూచించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం పనులు ఇతర పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ సర్కార్ ఇందుకు సంబంధించిన అకౌంట్‌ని క్లోజ్ చేశారని తద్వారా బిల్లుల చెల్లింపునకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి అకౌంట్ తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మనమంతా టీడీపీ వారసులం - పెత్తందారులం కాదు: చంద్రబాబు
పీకపై కత్తిపెట్టినా సరే ‘జై తెలుగుదేశం’ నినాదమే: నారా చంద్రబాబు