Ministers Nadendla and Uttam Kumar Reddy Meeting: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి వాతావరణం నడుమ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కలిసి ముందుకు వెళ్లనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్‌లో ఇరువురు మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ కమిషనర్లు డీఎస్ చౌహాన్, సౌరభ్ గౌర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిన నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, మద్ధతు ధరల చెల్లింపు, నిల్వ, రవాణ, మిల్లింగ్, పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఆస్తుల బదిలీ అంశాలపై విస్తృతంగా చర్చించారు. బియ్యం పంపిణీలో 3 శాతంలోపు మాత్రమే తరుగు, ఎలాంటి అక్రమాలు లేకుండా దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న దృష్ట్యా ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏపీ ప్రభుత్వానికి ఇవ్వడానికి మంత్రి ఉత్తమ్ అంగీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2017 నుంచి ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ కార్యాలయం విజయవాడ కేంద్రంగా సేవలందిస్తుండగా హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో ఉన్న కార్యాలయం ఖాళీగా ఉందని ఆ భవనాన్ని జూన్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని మనోహర్ వెల్లడించారు.
మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం: సోమాజిగూడ శాంతిశిఖర ఉన్న 16 ఫ్లాట్లును కూడా తెలంగాణకు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని ఇది ఒక చక్కటి సందేశం ఇచ్చినట్లవుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. భవిష్యత్తులో ఎవ్వరూ సమస్యలు ఎదుర్కోవద్దని ప్రజలు, ప్రత్యేకించి రైతులకు మేలు చేయాలనిది కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలంగాణలో అమల్లో ఉన్న టెక్నాలజీ మార్పులు మేం స్వీకరించి రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని అన్నారు. అలానే తెలంగాణ ప్రభత్వం కాకినాడ నుంచి పిలిప్పిన్స్‌కు బియ్యం ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిల్వ, గోదాముల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలు, సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో భోజనం అందించనున్నామని మనోహర్ పేర్కోన్నారు.
ఉత్తమ్ సంతోషం వ్యక్తం: పిలిప్పీన్స్‌కు కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న దృష్ట్యా విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో కూడా అవసరమైన సదుపాయాలు కల్పనకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో సన్న వడ్లు క్వింటాల్‌పై 500 రూపాయల బోనస్ ఇస్తున్న దృష్ట్యా ఇరు రాష్ట్రాల మధ్య అనధికారికంగా ధాన్యం రవాణా కట్టడి గురించి కూడా మట్లాడుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు పౌరసరఫరాల భవన్ కొరత ఉందని, బయట సమావేశాలు పెట్టాల్సి వస్తుందని ప్రస్తావించారు. ఇక నుంచి ఆహార, అనుబంధ శాఖలన్నీ ఇదే కార్యాలయంలో ఉండబోతున్నాయని ఉత్తమ్ సంతోషం వ్యక్తం చేశారు.
'రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా అప్లయ్ చేయవచ్చు - మ్యారెజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు'
జూన్‌లో స్మార్ట్ రేషన్‌కార్డులు మంజూరు - ఈ నెలాఖరు వరకే గడువు!