BRS Petition in High Court : రజతోత్సవ వేడుకలకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు 17వ తేదీకి వాయిదా వేసింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వరంగల్ కమిషనర్, కాజీపేట ఏసీపీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించడానికి నిర్ణయించింది. వేడుకలు, సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు వరంగల్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.
వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు, సభ నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని హోంశాఖ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
హోంశాఖ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు : సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులకు సమయం కావాలి కదా అని హోంశాఖ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. శాంతిభద్రతల సమస్య, ఇంటిలిజెన్స్ రిపోర్టును పరిగణలోకి తీసుకొని అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాలు సేకరించడానికి సమయం పడుతుందని హోంశాఖ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 21వ తేదీ వరకు సమయం ఇవ్వాలని కోరగా దానికి నిరాకరించిన హైకోర్టు 17వ తేదీ వరకు సమయం ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ న్యాయవాదిని ఆదేశించింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
'మార్పు అంటే రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయి - వీరికి ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు'