Mla Kaushik Reddy On Tgpsc Group-1 Exam : రాష్ట్రం లో గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో భారీ కుంభకోణం జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 25 సెంటర్స్‌లో 10 వేల మంది పరీక్షలు రాస్తే 69 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, కోఠి ఉమెన్స్ కళాశాలలోని సెంటర్ 18, 19 కేంద్రాల్లో 1490 మంది రాస్తే వారిలో 74 మంది ఎలా పాసయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే పరీక్షా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి గ్రూప్-1 పరీక్షలో ఎస్టీ కోటాలో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం పైనే తమకు అనుమానం ఉందన్నారు.
ఒకే నంబర్ సిరీస్ : ఉర్దూ మీడియంలో పరీక్ష రాసిన 9 మందిలో 7 మంది పాసవ్వగా టాప్ వంద ర్యాంక్‌లలో ముగ్గురు ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఏడు వేల మందికి పైగా తెలుగులో పరీక్ష రాస్తే టాప్ 100 ర్యాంకులలో కేవలం నలుగురు మాత్రమే ఎలా ఉంటారని, ఇదే అసలైన స్కామ్ అని అన్నారు. ఈ పేపర్లను కరెక్షన్ చేసిన వారిలో కూడా అర్హులు కాని వారు ఉన్నారని ఆరోపించారు. ఒకే నెంబర్ సిరీస్ కలిగిన వందలాదిమందికి ఒకేలా ఫలితాలు రావడంపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
వారికి చీకటి ఒప్పందం : గ్రూప్-1 పరీక్ష ఫలితాలలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే బీజేపీలోని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ ఎందుకు స్పందించరంటే సీఎం రేవంత్‌తో వారికి చీకటి ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయని, సీఎం రేవంత్ చెప్పు చేతల్లోనే బీజేపీ నేతలందరూ ఉన్నారని ఆరోపణ చేశారు. గ్రూప్-1 ఫలితాల మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అన్నింటికీ తెగించే : గత పదేళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల 30 వేలు, ప్రైవేటు రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు. తెలంగాణపై దిల్లీ పార్టీలకు ప్రేమ ఎప్పటికీ ఉండదని, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మీడియా సమావేశాన్ని కేసీఆర్ అనుమతితోనే నిర్వహించానన్న కౌశిక్ ఇవాళ మాట్లాడిన అంశాలపై రేపే తన ఇంటికి పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని అన్నారు. అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదని, కేసీఆర్ నాయకత్వంలో అన్నింటికీ తెగించే పోరాడుతున్నామని కౌశిక్ రెడ్డి తెలిపారు.
"గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారు. కోఠి కళాశాల 18, 19వ సెంటర్ల నుంచే 74 మంది ఎంపికయ్యారు. కోఠి కళాశాలలో 1490 మంది రాస్తే 74మంది ఎంపికయ్యారు. 25 సెంటర్లలో 10వేలమంది రాస్తే 69 మాత్రమే ఎంపికయ్యారు. 654 మందికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయి?" -కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
'మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను' - పాడి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కలెక్టరేట్లో గొడవకు దిగిన ఎమ్మెల్యేలు - ఒకరినొకరు తోసుకున్న కౌశిక్ రెడ్డి, సంజయ్