KTR 30Percent Commission Comments : శాసన సభలో బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 30,20 శాతం కమీషన్లు తీసుకుని బిల్లులు చేస్తున్నారని, సచివాలయం వద్ద ఆందోళనలు చేస్తున్నారన్న ఆయన మాటలపై అధికార పక్షం భగ్గుమంది. కేటీఆర్ వ్యాఖ్యలపై ఉపముఖ్యంత్రి భట్టి విక్రమార్క సైతం తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, బీఆర్‌ఎస్‌సభ్యులు ఒళ్లుదగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
ముందుగా శాసన సభలో బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లారాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వం పని తక్కువ ప్రచారం ఎక్కువ అంటూ మాట్లాడారు. దీన్ని మంత్రి పొంగులేటి తప్పుపట్టారు. ఇలాంటి చవకబారు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే అంశంపై కేటీఆర్ జోక్యం చేసుకుని మంత్రలు ప్రతిసారీ సభ్యుల ప్రసంగాలకు అడ్డు తగలవద్దంటూనే ఈ ప్రభుత్వంలో కమీషన్లు లేకుండా పనులు జరగడం లేదని వ్యాఖ్యానించారు.
"మంత్రులు అంత ఎగ్జైట్ అయి మాట్లాడితే ఎలా? ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. మీరు నెరవేర్చని హామీలు, పథకాలపైనే మాట్లాడుతున్నాము. మంత్రులు లాగే మేము కూడా రెచ్చగొట్టాలంటే ఆ పని చేయవచ్చు. 30 శాతం కమీషన్లు అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20 శాతం కమీషన్లని సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారు." - కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సభలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దశలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. శాసనసభను రాష్ట్రాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం కమిషన్ అంటున్న కేటీఆర్ నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. లేదంటే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పనులు చేపించి బిల్లులు ఇవ్వలేదన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు : మీ పాపం వల్ల బిల్లులు రాకా గుత్తేదారులు ఏడుసున్నారని బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి చెప్పారు. తాము ప్రస్తుతం బిల్లుల చెల్లింపులను సరిచేస్తున్నామని వివరించారు. బీఆర్‌ఎస్ సభ్యులు కేటీఆర్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చడంతో వాళ్లు సభ నుంచి వాకౌట్ చేశారు.
"కేటీఆర్ గౌరవంగా మాట్లాడుతారని నేను ఊహించా. కేటీఆర్ సభనే కాదు రాష్ట్రాన్ని కూడా తప్పుదోవపట్టిస్తున్నారు. అభయహస్తం పేరుతో అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. రూ.4 కోట్లు ఇచ్చి రూ.40 కోట్లు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని పల్లా అన్నారు. మేం ప్రకటనలు ఇచ్చినట్టు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చూశారా? నిరాధార ఆరోపణలతో పల్లా సభను తప్పుదోవపట్టించారు. 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేటీఆర్ అంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.40 వేల కోట్ల పనులు చేసి బిల్లులు చెల్లించలేదు. కేటీఆర్ తన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్నా. నిరూపించని పక్షంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. మైకు ఉందని అడ్డుగోలు ఆరోపణలు చేయడం సరికాదు." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తైంది : మంత్రి తుమ్మల
గతంలో అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30లక్షల కోట్లు ఖర్చు చేశారు : భట్టి విక్రమార్క