BRS Leader Jagadish Reddy on Electricity Privatization : ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుందని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇలాగే చేస్తే, రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థకు వచ్చే సబ్సిడీలు అన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొని, విద్యుత్ బిల్లులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ఆక్షేపించారు. ఇది విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు మొదటి అడుగు అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్ర నిర్ణయాలను తూ.చా తప్పకుండా అమలు చేస్తున్న రేవంత్‌రెడ్డి : ప్రాణం పోయినా విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ వ్యక్తులను రానివ్వమని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారన్నారు. మీటర్లకు మోటార్లు బిగిస్తే, వద్దని తెగేసి చెప్పారన్నారు. ప్రజల జీవితంపై ప్రభావం చూపించే విద్యుత్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పితే, వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి తూ.చా తప్పకుండా అవలంభిస్తున్నారని మండిపడ్డారు.
"ఈ బిల్లుల వసూళ్లు గతంలో కూడా కొన్ని పట్టణాల్లో ఇచ్చారు. దేశంలో కొన్ని నగరాల్లో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడేమో మన రాష్ట్రంలో కేవలం ఒక పాతబస్తీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అది అంతటితో ఆగదు. దాన్ని పైలెట్ప్రాజెక్ట్గా తీసుకుంటున్నామని చెప్పారంటే, ఇది రాష్ట్రమంతటా కూడా ప్రైవేట్ వ్యక్తులు చేతులకు విద్యుత్ బిల్లుల వసూలు అప్పజెప్పడమే."-జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి
Jagadish Reddy Fires on Congress Party : విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం తప్పుడు చర్యని, ఒక్కసారి ప్రైవేట్ వ్యక్తులను రానిస్తే, అది ఇబ్బందికరంగా తయారవుతుందన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే అని స్పష్టం చేశారు. గతంలో ఒడిస్సాలో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. పాతబస్తీలో 45శాతమే బిల్లులు వసూలు అవుతున్నాయని, వాళ్లు కట్టడం లేదని అందుకే ప్రైవేట్ వాళ్లకు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పటం హాస్యాస్పదం.
అది పూర్తిగా అవాస్తవం కూడా. ఇది పాతబస్తీ వాసులను అవమానించడమే అని అన్నారు. ఓల్డ్‌సిటీ వాళ్లు మనవాళ్లే, పాతబస్తీతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు 97 నుంచి 98 శాతం విద్యుత్ బిల్లులు కడుతున్నారన్నారు. ఒకవైపు సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుంటే, ఉపముఖ్యమంత్రి వెళ్లి అందులో పాల్గొంటారు. మరోవైపు ప్రైవేట్ వ్యక్తులకు విద్యుత్ బిల్లుల వసూలును అప్పగిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాయిదాల మీద వాయిదాలు : జగదీశ్ రెడ్డి - BRS Leader Jagadish Reddy