Pratidwani: మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. పోలీసు అధికారుల బట్టలూడదీస్తాం, ఉద్యోగాలు ఊడబీకి దోషులుగా నిలబెడతామంటూ రెచ్చిపోయారు. ఒక్కఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్ల పాటు అధికారంలో అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచి జగన్, ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా తీరు మార్చుకోలేదని మరోసారి స్పష్టం చేస్తోందీ ఉదంతం.
పోలీసులను ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత జగన్ మరోసారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు.
బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగులుగా మహిళలు ఉన్నారని జగన్ మరిచారా? అని పోలీసు అధికారుల సంఘం సభ్యురాలు ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. జగన్ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
పోలీసులపై వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. చట్టపరిధిలోనే పోలీసులు పనిచేస్తున్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
తొమ్మిది నెలల క్రితమే ప్రజలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బట్టలు ఊడదీశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పుడు పోలీసుల బట్టలు ఊడతీసి కోడతామని ఆయన అనడం మానసిక స్థితికి అద్దం పడుతోందని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఘర్షణలో రాజకీయ కోణం లేదని తెలిపారు. వ్యక్తిగత వివాదాలతో దాడులు చేసుకున్నట్లు వివరించారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం పర్యటనకు వెళ్లి పోలీసులపై వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. మాజీ సీఎం ప్రవర్తన ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల తర్వాత 11 పక్కన ఒకటి పోయి ఒకటే మిగులుతుందని అనగాని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ హత్యా రాజకీయాలకు పేటెంట్ అని ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆరోపించారు. ప్రజలు జగన్ మోహన్‌రెడ్డిని పాతాళంలోకి తొక్కినా అహంకారం తగ్గలేదని విమర్శించారు. అహంకారం నెత్తికెక్కి పోలీసులను ఆయన విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఆ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు.
ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, అంతకు మించి.. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నుంచి ఈ తరహా ప్రవర్తనను ఎలా చూడాలి? చట్టాల్ని, వ్యవస్థల్ని గౌరవించే నాయకుడి లక్షణాలు ఇలానే ఉంటాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకుడు పోతుల బాలకోటయ్య, న్యాయవాది నన్నేసాహెబ్ పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.