Pratidwani: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ భక్తుల ఆస్థాన క్షేత్రం కలియుగ వైకుంఠంగా పిలిచే పవిత్రస్థలం. అలాంటి చోట ఇటీవల సర్వదర్శనం క్యూ లైన్లలో "డౌన్ డౌన్ టీటీడీ ఛైర్మన్" అన్న నినాదాలు సంచలనం సృష్టించాయి. తీరా చూస్తే ఆ వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలడం విస్తుబోయేలా చేసింది.
ఇదే కాదు టీటీడీ గోశాలలో ఆవుల మరణాలప్పుడూ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారి కేసుల వరకు వెళ్లింది. ఇప్పుడు క్యూ లైన్లలో నినాదాల ఘటన వెనక వైఎస్సార్సీపీ నేత అచ్చారావు ఉన్నారు. అసలు అక్కడేం జరుగుతోంది? టీటీడీకి కళంకం తేవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? వారి అసలు అజెండా ఏమిటి? వెంకన్నబాబును అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుంటే చూస్తూ వదిలేద్దామా? ఇదీ నేటి ప్రతిధ్వని.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల వెంకన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నామన్నారు. అదెంత వరకు వచ్చింది? తిరుమల కొండ మీద రాజకీయాలకు తావు లేకుండా చేయడానికి ప్రభుత్వం, టీటీడీ ఏ దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి? ఈ చర్చలో టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి, రాజకీయ విశ్లేషకుడు ఏ శ్రీనివాసరావులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లలో టీటీడీకి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వెనక అసలేం జరిగింది? అదొక్కటే కాదు టీటీడీ గోశాలలో వందల ఆవులు చనిపోయాయని వైఎస్సార్సీపీ నాయకుడు భూమన చేసిన ఆరోపణలపై విచారణ చేశారు కదా ఏం తేలింది?
తిరుమల వంటి పవిత్రక్షేత్రంలో రాజకీయాలు మాట్లాడవద్దని ఎంతోకాలంగా భక్తులు కోరుతున్నారు. అయినా ఈ తరహా నినాదాలు, వివాదాలు వారి మనోభావాలు గాయపరచడం కాదా? క్యూలైన్‌లలో కొందరు టీటీడీ సిబ్బంది తీరూ వివాదాస్పదమైంది. వారే వీడియో తీసి షేర్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. కొందరు టీటీడీ ఉద్యోగులు వైఎస్సార్సీపీ అజెండాను అమలు చేస్తున్నారా?
పింక్ డైమండ్ నుంచి వైఎస్సార్సీపీ వాళ్లు టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలు, టీటీడీ నెయ్యి కాంట్రాక్టు వంటివి కావొచ్చు పదేపదే తిరుమల పవిత్రతను మంటగలిపేలా చర్యలు అనేకం చేశారు. చేస్తునే ఉన్నారు. ఇంకెంతకాలం ఇలా? జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అకృత్యాలను ఈ ప్రభుత్వం ఎంత వరకు సరిదిద్దగలిగింది?
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు: టీటీడీ ఏఈవో
తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటన - వీడియో తీసిన ఉద్యోగులపై చర్యలు!