Pratidwani : కట్టేవారి ఆలోచనలు వేరుంటాయి, కూల్చేవారి ఆలోచనలు వేరే ఉంటాయి. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో అది మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ వైఖరి బట్టబయలు అయింది. అధికారంలో ఉన్నా లేకున్నా అమరావతికి అడ్డం పడడం, సాధ్యమైనంత మేర అడ్డంకులు సృష్టించడం, అప్పులు పుట్టకుండా, అనుమతులు రాకుండా సైంధవపాత్ర పోషించడమే జగన్ అండ్ కో పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ నాయకత్వం ప్రపంచ బ్యాంకుకు ఇటీవలే పంపిన తప్పుడు ఫిర్యాదులే అందుకు నిదర్శనం. ఆ కంప్లయింట్స్‌లో పసలేదని ప్రపంచబ్యాంకు నిర్థరించుకోబట్టి ఆపద తప్పి పోయింది. అమరావతికి మొదటి విడతగా రూ.4,285 కోట్ల రుణం మంజూరైంది. లేకుంటే ఏమయ్యేది? అసలు ఈ ఫిర్యాదుల వెనక వాళ్ల ఉద్దేశం ఏమిటి? అమరావతిపై మళ్లీ మళ్లీ అవే కుట్రలు ఎందుకు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సి. కుటుంబరావు, సీనియర్ జర్నలిస్ట్ ఎ. సురేష్‌లు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.
అసత్యాలన్నీ కూర్చి ఫిర్యాదు : ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ, విదేశాల్లోని రకరకాల సంస్థలు, వ్యక్తుల పేరుతోనూ అమరావతిలో అనర్థం జరిగి పోతోందన్నట్లుగా ప్రపంచ బ్యాంకుకు వైఎస్సార్సీపీ నాయకత్వం మెయిల్స్ పంపించారని తెలిపారు. రాజధానికి భూసమీకరణ వల్ల రైతులు, రైతు కూలీలకు ఉపాధి పోయిందని, వారి జీవనోపాధులు దెబ్బతిన్నాయన్నది వారి అభియోగమన్నారు. రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని, దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తుతాయని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పర్యావరణం, జీవావరణంపైనా ప్రభావం పడుతుందని, పంట భూములు తీసుకోవడం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందంటూ అసత్యాలన్నీ కూర్చి ఫిర్యాదు రూపొందించారని తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. గతంలోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రయత్నించగా, వైఎస్సార్సీపీ ఇలాగే తప్పుడు ఫిర్యాదులు పంపించిందని గుర్తుచేశారు.
ఉల్లంఘనలేవీ లేవని నిర్ధరణకు : వైఎస్సార్సీపీ పంపించిన ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ తనిఖీ బృందం ఇటీవల రాజధానిలో రెండు దఫాలుగా పర్యటించిందన్నారు. విజయవాడలో ఈ బృందం మకాం వేసిన హోటల్‌కు వైఎస్సార్సీపీ అనుకూలురు పలుమార్లు వెళ్లి, వారిని ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని గుర్తుచేశారు. అయితే, ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఫిర్యాదుదారులతోనూ సమావేశమై అభిప్రాయాలు తీసుకుందన్నారు. రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని, ఉల్లంఘనలేవీ లేవని నిర్ధరణకు వచ్చిందని వెల్లడించారు. ఆ మేరకు ప్రపంచ బ్యాంకుకు నివేదించిందన్నారు. సంతృప్తి చెందిన ప్రపంచ బ్యాంకు ఆ ఫిర్యాదును డ్రాప్ చేసి, అమరావతికి రుణం మంజూరు చేసిందని వెల్లడించారు.
సోషల్ మీడియా పోస్టులు - ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జగన్ ప్రవర్తనను ఎలా చూడాలి? చట్టాల్ని గౌరవించే నాయకుడి లక్షణాలు ఇవేనా?