Pratidwani: ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్లాస్టిక్ వస్తువుల విచ్చలవిడి వినియోగంతో భూమి, నీరు, గాలి తీవ్రస్థాయిలో కలుషితం అవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. నదులు, సరస్సులు, పర్యాటక ప్రదేశాలు, నివాస స్థలాలు ఎక్కడచూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఐదోవంతు ప్లాస్టిక్ వ్యర్థాలు మన దేశంలోనే పోగవుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీని ఫలితంగా క్యాన్సర్లు, చర్మవ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జర్మనీ, దక్షిణకొరియా వంటి దేశాలు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నారు. మరి భారతదేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఏస్థాయిలో జరుగుతోంది? స్వచ్ఛత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్న మన ప్రభుత్వాలు ఎలాంటి లక్ష్యాలతో పనిచేస్తున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
దేశంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల జలవనరులు, గాలి, నేలపై కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలపై పడుతున్న దుష్ప్రభావం ఎంత? నివాస ప్రాంతాలతో పాటు పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీవ్రంగా ఉండటానికి కారణాలు ఏంటి?
పాల ప్యాకెట్ల నుంచి కాయగూరల సంచుల వరకు నిత్యజీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైపోయింది. దీనివల్ల ప్రజారోగ్యానికి ఏర్పడుతున్న ముప్పు ఏంటి? భారత్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ శాతం తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి? అభివృద్ధి చెందిన దేశాల్లో రీసైక్లింగ్ కోసం ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారు? మన దేశంలో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 11 కిలోల ప్లాస్టిక్ వినియోగిస్తున్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యానికి అడ్డుకట్ట వేసేది ఎలా?
ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం పెరగాలంటే ఎలాంటి ప్రచార, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి?
ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? అమలులో ఎదురవుతున్న అవరోధాలు ఏంటి? ప్లాస్టిక్ కాలుష్యం బారినుంచి తప్పించుకోవడానికి ప్రజలు, ప్రైవేటు సంస్ధలు స్వచ్ఛందంగా ముందుకు రావాలంటే ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకుందాం.
ఈ చర్చలో సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ హెడ్, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వి.హిమబిందు, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నంలు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సాగుకు స్మార్ట్ నమూనాలు - ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా వ్యవసాయం
ఆందోళనలో అమెరికా విద్య - విద్యార్థుల భవిష్యత్తు ఏం కానుంది?