"లలితసంగీత మహామహోపాధ్యాయ" మహాభాష్యం చిత్తరంజన్
నేడు తెలుగు లలితసంగీత రంగానికి అపారమైన, అజరామరమైన సేవలని అందించిన గాయకులు, గీతరచయిత, స్వరకర్త, ఆధ్యాత్మికవేత్త శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ మాస్టర్ గారి ద్వితీయ వర్ధంతి.

Published : July 21, 2025 at 7:03 AM IST
'కొండంత దేవుడికి..'
Mahabhashyam Chittaranjan Story : తెలుగునాట లలితసంగీతకారులలో మేరునగసమానులు డా. మహాభాష్యం చిత్తరంజన్ గారు. వారి ప్రస్థానం ఒక సజీవచరిత్ర. సమకాలీనులని అబ్బురపరిచే ఒక అద్భుతం. భావితరాలని ముందుకు నడిపించే ఒక స్ఫూర్తిపథం. ఒక జీవితకాలంలో ఎంత అపారమైన కృషిని చేయగలమో, తద్వారా ఎన్ని సత్ఫలితాలు సాధ్యమో సోదాహరణంగా నిరూపించే ఒక సిద్ధాంతగ్రంథం!
పుట్టగానే పరిమళించిన పువ్వు
చిత్తరంజన్ గారు మహర్షిసమానులైన శ్రీ మహాభాష్యం రంగాచార్యులు, విదుషీమణి శ్రీమతి పేరిందేవి దంపతుల నోముఫలమై ఆగస్టు 25, 1938న, వారి ప్రథమ సంతానంగా ఉదయించారు. వీణ, వయొలిన్, హార్మోనియంలలో నేర్పు గలిగిన తల్లిగారి పాటలను విని, తిరిగి పాడుతూ, సంగీతప్రపంచంలోకి అడుగులు వేశారు. ఎనిమిది సంవత్సరాల అతి పిన్న వయసులోనే దక్కన్ రేడియోలో గాయకులుగా రంగ్రవేశం చేశారు. శ్రీ పుచ్చా సుబ్బారావు, పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గార్లకు ప్రియశిష్యులై, వారి వద్ద శాస్త్రీయసంగీతపు లోతులని మథించారు.
పలు చలనచిత్రాలలో గానం చేసిన వీరు, "మన మహాత్ముడు", "శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మహాత్మ్యము" చలనచిత్రాలకూ, "రెండు పువ్వులు" వంటి డాక్యుమెంటరీలకూ సంగీతదర్శకత్వాన్ని నెరపి, తమ ప్రతిభను ప్రకటించారు. 1971 నుండీ 1997 వరకూ ఆకాశవాణిలో ఉద్యోగవిధులను నిర్వర్తిస్తూ, 1972 నుండీ A గ్రేడ్ గాయకులుగా, 1998 నుండీ టాప్ గ్రేడ్ సంగీతదర్శకులుగా వీరు అందించిన సేవలు అత్యున్నతం. చిత్తరంజన్ గారు రూపొందించి, నిర్వహించిన "ఈ పాట నేర్చుకుందాం", "కలసి పాడుదాం" వంటి కార్యక్రమాలు ఎందరో యువగాయనీగాయకులకు దిశానిర్దేశనం చేశాయి; "చిత్తరంజన్ మాస్టర్ గారు" అనే పేరుని స్థిరపరిచాయి.
లలితగాంధర్వకళానిధి
సప్తస్వరలోకంలో సప్తతిని పూర్తి చేసుకున్న మాస్టర్ గారు, లలితసంగీతలోకంలో అజరామరమైన సంపదని సృజించారు. 15 వేల పైచిలుకు లలితగీతాలకి, గేయాలకి, సంగీతరూపకాలకి, పద్యాలకి, జానపదగీతాలకి, స్తుతులకి, స్తోత్రాలకి, శ్లోకాలకి, మరెన్నిటికో బాణీలని సమకూర్చిన నిరంతర సంగీతస్రవంతి వీరు. 8 వేల పాటలకి స్వయంగా తమ గళాన్ని అందించిన సుమధుర గాయకులు. ఇక శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారితో చిత్తరంజన్ గారి సహచర్యం లలితసంగీతపు చరిత్రలో ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. వారిరువురి కలయికలో వేలకొద్దీ సులలితగీతాలు ప్రాణం పోసుకున్నాయి.
1984లో శ్రీ కృష్ణానందమఠం వారి ఆధ్వర్యంలో మాస్టర్ గారు ఒక అపూర్వమైన ప్రయోగాన్ని చేశారు. భగవద్గీతలోని మొత్తం 701 శ్లోకాలకూ, గీతామహాత్మ్యంలోని 28 శ్లోకాలకూ విశిష్టమైన 174 కర్నాటక, హిందుస్తానీ రాగాల ఆధారంగా సంగీతాన్ని సమకూర్చారు. భారతదేశంలోనే తొలిసారిగా "లలితసంగీత సౌరభం" పుస్తకం ద్వారా లలితసంగీతపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, దానికి లక్షణగీతాలని రచించిన సంగీతజ్ఞులు చిత్తరంజన్ గారు! పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కొరకు లలితసంగీతానికి రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు రూపకల్పన చేసి, దానికి పాఠ్యపుస్తకాలని ఏర్పరచిన స్రష్ట. లలితసంగీతంయొక్క ఆవిర్భావం, దాని చారిత్రక వికాసం, ప్రఖ్యాతులని సోదాహరణంగా విశ్లేషిస్తూ, స్వరసహితంగా వీరు రచించిన వ్యాససంపుటి "లలితసంగీతం 80 సంగీత సారస్వత మలయమారుతాలు" ఒక అసమాన ప్రామాణిక గ్రంథం!
స్వరజ్ఞానసుధార్ణవ
చిత్తరంజన్ గారిని అనేక పురస్కారాలూ, బిరుదులూ తాముగా వరించి వచ్చాయి. 1962లో ఋషికేష్ డివైన్ లైఫ్ సొసైటీ వారిచే 'గానరత్న' బిరుదు, 1982లో భాషాకుటీరం వారి 'వాయుగానవిలోల' బిరుదు, 1988లో డా. నూకల చినసత్యనారాయణ గారిచే 'లలిత గాంధర్వ కళానిధి' బిరుదు, 1994లో అప్పటి విద్యాశాఖామాత్యులు శ్రీ పీ.వీ.రంగారావు గారి చేతుల మీదుగా 'లలితసంగీత చక్రవర్తి' బిరుదు, శ్రుతిలయ వారిచే 'లలితసంగీత సమ్రాట్' బిరుదు, 2004లో శ్రీ జ్ఞానసరస్వతి అకాడెమీ వారి 'The Legend of Light Music' అవార్డు, 2005లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారిచే 'లలితసంగీత భాష్యకార' బిరుదు, 2008లో ప్రముఖ నేపథ్యగాయని డా. పీ. సుశీల గారిచే 'స్వరజ్ఞాన సుధార్ణవ' బిరుదు, 2009లో రసమయి వారి శ్రీ సాలూరు రాజేశ్వరరావు స్మారక పురస్కారం. 2010లో బాంబే తెలుగు సమాఖ్య వారి అవార్డు, 2011లో ఢిల్లీ తెలుగు అకాడెమీ వారి ఉగాది పురస్కారం, 2014లో విజయవాడ స్వరఝరి వారిచే 'లలితసంగీత సర్వజ్ఞ' బిరుదు. 2019లో వంశీ ఇంటర్నేషనల్ వారి ఘంటసాల పురస్కారం -ఇలా ఎన్నో!
మాస్టర్ గారితో నా పరిచయం
2008లో నా శ్రీమతి కర్ణిక లలితసంగీతాన్ని నేర్చుకోవటానికి చిత్తరంజన్ గారి వద్ద చేరింది. చిన్నప్పటి నుండీ రేడియోలో వారి గళాన్ని అనేక పర్యాయాలు విని వున్నప్పటికీ, వారిని కలవటం అప్పుడే, లలితసంగీతపు పూర్వరంగం, ఆవిర్భావం, వికాసం, మొ. వాటిని క్లాసుకి కొంత చొప్పున వివరించి చెప్పారు. అంత సాధికారికంగా వాటినిగురించి తెలుసుకునే అరుదైన అవకాశం ఆ విధంగా లభించింది. తరువాత కొన్ని సంవత్సరాలకి దాదాపు ఎనిమిది యేళ్ళ వయసులో మా అబ్బాయి శ్రీకర్ ని మాస్టర్ గారి వద్ద శిక్షణకి చేర్చాము. "ఎల్లలెఱుగని వాళ్ళము కల్లలెఱుగని వాళ్ళము”, మొ. పిల్లల పాటలు, "కొమ్మలలో కోయిలనై కూయనా", "మధురవీచికలు మెదిలే మనసులో", మొ. ప్రకృతిపరమైన పాటలు, "కైలాసవాస శివశంభో", మొ. భక్తిగీతాలు, "నీలో దీపం వెలిగించు", మొ. ప్రబోధాత్మకగీతాలు- ఆ క్లాసులు అన్నీ గొప్ప అనుభవాలు. 'కోసల' రాగంలో వారు కూర్చిన "విరబూసి ఇరుల తరులు" పాటని 9 సం.ల శ్రీకర్ 'పాడుతా తీయగా' ప్రీఫైనల్స్ లో పాడినప్పుడు శ్రీ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారి కళ్ళు చెమర్చి, వాడిని అక్కున చేర్చుకుని, ముద్దు పెట్టుకుని, ఉత్తమప్రతిభాపురస్కారాన్ని ఇచ్చిన సంఘటన మరచిపోలేనిది.
పాటని నేర్పేటప్పుడు దాని సాహిత్యంలోని భావుకతని ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూ, దానికి అనువైన రాగాన్ని ఎంచుకున్న విధానాన్ని సూచిస్తూ, బాణీలో స్వరాక్షరాలు, అన్యస్వరప్రయోగాల చమత్కారాన్ని ఎత్తి చూపుతూ- ఇలా ఎన్నో విశేషాల వివరణతో కూడిన పద్ధతి మాస్టర్ గారిది. అంతేకాదు, వాటిలోని వివరాల పట్ల ఒక ఖచ్చితత్వం ఉంటుంది. ఔత్సాహిక శిష్యులకి అది ఒక మందాకినీస్రవంతి. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వారు శిష్యుల నుండీ ప్రశ్నలని ఆశిస్తారు. తగినంత ఆలోచనని చేసి, లోతుగా నేర్చుకోవాలని ఆశిస్తారు. ఉత్తమశ్రేణికి చెందిన గురువుల లక్షణం అది!
అలాగే, శాస్త్రీయసంగీతాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలో చెపుతుంటారు. "నీ దయ రాదా" కీర్తనయొక్క పల్లవిలో ఉన్న ఒక్కొక్క సంగతీ ఎందుకు అలా ఉన్నది అని వారు చేసిన విశ్లేషణ నాకు ఎన్నో కొత్త కోణాలను చూపించింది. సమకాలీన శాస్త్రీయ గాయకులు వాటిని పాడుతున్న పద్ధతిని నిరసిస్తూ, వారు ఒక మాటని అన్నారు: "విద్వాంసుడు వేరు- కళాకారుడు వేరు." ఆ ఒక్క వాక్యం నాకు ఎన్నాళ్ళుగానో ఉండిపోయిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలని ఇచ్చింది. శాస్త్రీయ, లలితశాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతపద్ధతులని అన్నిటినీ ఆకళింపు చేసుకున్న మాస్టర్ గారు వాటి తులనాత్మక పరిశీలనని చేయగల అతి కొద్దిమందిలో ఒకరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వైలక్షణ్యం
ఒక అత్యున్నతస్థాయి గాయకులుగా, సంగీతకారులుగా, వాగ్గేయకారులుగా మాత్రమే చూస్తే మాస్టర్ గారిలోని విలక్షణతని పూర్తిగా పట్టుకోలేము. అదనంగా చిత్తరంజన్ గారి ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్నని వేసుకుంటే, నాకు కనిపించే ముఖ్యమైన లక్షణాలు మూడు: (1) అలుపెఱుగని జ్ఞానపిపాస, (2) అకుంఠితకార్యదీక్ష, (3) తనకు తెలిసిన సర్వస్వాన్నీ శిష్యులకి నేర్పాలనే తపన. విడివిడిగా ఈ మూడు లక్షణాలనీ వ్యక్తులలో మనం గమనిస్తూ వుంటాము. కానీ, ఒకే వ్యక్తిలో ఈ మూడింటి కలయిక చాలా అరుదు. చిత్తరంజన్ గారు అటువంటి అరుదైన వ్యక్తి.
మాస్టర్ గారికీ, నాకూ సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం. “పాట పాడుమా కృష్ణా", "ఎందుకే నీకింత తొందర" (మల్లీశ్వరి), "ఆ తోటలో నొకటి ఆరాధనాలయము", మొ. పాటలలోని ప్రయోగాలగురించి మేము గంటల కొద్దీ చర్చించుకున్నాము. ఆ చర్చలలో అనేక గూఢమైన విషయాలు వెలికి వస్తుండేవి. ఒక్క స్వరం పాటని ఎంతగా ప్రభావితం చేయగలదో. ఒక్క స్వరప్రస్తారం పాటకి తనదైన ముద్రని ఎలా ఇవ్వగలదో వివరించేవారు.
ఇటీవలి ఒక సంఘటనని ప్రస్తావిస్తాను. మలయాళ సంగీతదర్శకులు దేవరాజన్ గారి పాటలని వింటుంటే 1975 సినిమా "స్వామి అయ్యప్ప" (డబ్బింగ్) లోని 'జగముల నేతా భాగ్యవిధాతా శ్రీమన్నారాయణా' పాట తటస్థపడింది. కర్నాటక భైరవి రాగం ఆధారంగా చేసిన సినిమా పాటలు చాలా తక్కువ. ఆ పాట భైరవిలా వినిపించింది. వెంటనే మాస్టర్ గారికి పాట YouTube లింక్ ని మెసేజ్ చేశాను. అప్పుడు సమయం రాత్రి 10:15. కొద్ది నిమిషాలలోనే మాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ పాట భైరవిలోనే ఉందని ధ్రువపరిచారు. పాటయొక్క కాంపోజిషన్ గురించీ, యేసుదాస్ గారి గానంగురించీ కాసేపు మాట్లాడుకున్నాము. దాదాపు 84 సంవత్సరాల వయసులో వారికి ఉన్న ఈ తృష్ణా, ఉత్సాహమూ నావంటి వారందరికీ గొప్ప స్ఫూర్తి!
సువర్ణసౌరభం
"సంగీతజ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే", "నిధి చాల సుఖమా" అన్న త్యాగరాజ స్వామి తత్త్వసారం తొలినుండీ నిబిడీకృతమైన అమనస్కులు చిత్తరంజన్ గారు. అంతర్దృష్టితో సచ్చిదానందస్వరూపులైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని ఉపాసించి, అపారమైన ఆధ్యాత్మికజ్ఞానార్జన చేశారు. సంక్లిష్టమైన అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలను విశదీకరిస్తూ "శ్రీ సుబ్రహ్మణ్యతత్త్వం" సంపుటి ద్వారా ఎన్నో కీర్తనలని వెలువరిచిన వాగ్గేయకారులు! ఆత్మ, అహం భావనల తాత్త్వికమూలాలని శోధించి, అద్వైతస్థితిని చేరుకున్న వీరు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అనుజ్ఞతో "అవధూత శ్రీ షణ్ముఖ చిత్తరంజనస్వామి"గా ఇప్పటికి దాదాపు 140 మందికి జ్ఞానదీక్షని ఇచ్చారు. నిత్య సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక కృషీవలురైన డా. చిత్తరంజన్ గారితో ప్రత్యక్షపరిచయం నా భాగ్యం. వారికి నా పాదాభివందనాలు!!
(ఈ వ్యాసం జూన్ 2022లో వ్రాయబడింది)
- శ్రీనివాస్ జొన్నలగడ్డ, ఈటీవీ భారత్ సీఈవో
(టెక్నాలజీ సొల్యూషన్స్ అందించడంలో 30 ఏళ్ల అనుభవం శ్రీనివాస్ జొన్నలగడ్డ (జేఎస్) సొంతం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు ఆయన వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో జేఎస్‌కు అపారమైన నైపుణ్యం ఉంది. ఆయనకు భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం అంటే అమితాసక్తి. వివిధ సింపోజియాల్లో వక్తగా, ప్యానెలిస్ట్‌గా ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు.)

