భారతీయులు పెళ్లిలో ఎందుకు పాన్ తింటారు?
- తమలపాకుతో ఇండియన్స్‌కు తరతరాల అనుబంధం! - కారణాలు, ఉపయోగాలు ఇవే

Published : September 15, 2025 at 11:03 AM IST
|Updated : September 15, 2025 at 11:09 AM IST
పెళ్లి తంతులో కీలమైన జీలకర్ర బెల్లం పెట్టడానికి తమలపాకు కావాలి
వరలక్ష్మీ వ్రతంలో వాయనం ఇవ్వడానికీ తమలపాకు కావాలి
శుభకార్యం మొదలు భగవతుండి పూజదాకా ఏది చేయాలన్నా తమలపాకు ఉండి తీరాల్సిందే
చివరకు భోజనం తర్వాత నోట్లో వేసుకోవడానికి కిల్లీ రూపంలోనూ కావాల్సిందే!
మరి, తమలపాకు భారతీయులకు ఎందుకింత ప్రత్యేకం? దానికి ఎందుకంత ప్రాముఖ్యత??
తమలపాకుతో భారతీయులకు ఉన్న బంధం ఈనాటిది కాదు. తరతరాలుగా ఉందీ అనుబంధం. హిందూ సంస్కృతిలో ఇదొక భాగం. వివాహాది శుభకార్యాల్లో తమలపాకుతో అతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తారు. అదృష్టానికి సూచిగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఈ నేపథ్యంలో తమలపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వివాహానికి అనివార్యం :
తమలపాకు లేకుండా హిందూ సంప్రదాయంలో పెళ్లి జరగదంటే అతిశయోక్తి కాదు. తాళి కట్టడానికి ముందు నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఘట్టం "జీలకర్ర-బెల్లం" పెట్టడం. దీన్ని తమలపాకులోనే ఉంచి వధూవరులు భాగస్వామి తలమీద పెడతారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలిసిందే. బెల్లంతో కలిసిపోయిన జీలకర్రను వేరు చేయడం కుదరదు. దంపతులు కూడా అలా కలిసిపోయి జీవించాలనేది అంత:సూత్రం. ఈ జీలకర్రబెల్లాన్ని తమలపాకులో ఉంచి తలపై పెట్టడం ద్వారా ఆయుష్షు, దాంపత్య సౌఖ్యం పెరుగుతుందని విశ్వసిస్తారు.
దైవారాధనలోనూ :
- దేవుళ్లను ఆరాధించడంలోనూ తమలపాకు ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది.
- తమలపాకులతో ప్రత్యేకంగా తయారు చేసిన మాలను హనుమంతుడి మెడలో వేస్తారు
- గణపతికి 21 తమలపాకులు సమర్పించి, ప్రత్యేక పూజ చేస్తారు
- వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కూడా తమలపాకు తప్పకుండా ఉండాల్సిందే. ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో వస్త్రాలు, పండ్లు, పూలతోపాటు తమలపాకు కూడా ఉంటుంది.
- సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు సైతం తమలపాకులు ఉండాల్సిందే.
- ఈ విధంగా ఎన్నో దైవకార్యాల్లో తమలపాకు స్థానం ప్రత్యేకంగా ఉంటుంది
భారతీయులు చేత్తోనే ఎందుకు తింటారు? - మన చేతిలోకి స్పూన్ ఎలా వచ్చింది? - షాకవుతారు!!
పోషకాల పవర్ హౌస్ :
- తమలపాకు సంప్రదాయ పరంగానే కాకుండా, వ్యక్తిగత ఆరోగ్య పరంగా కూడా ఎంతో కీలకంగా ఉంటోంది. తమలపాకును పోషకాల పవర్ హౌస్‌గా చెప్పుకోవచ్చు.
- నేరుగా నమిలి తినడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- తమలపాకులను వాటర్‌లో రాత్రి నానబెట్టి, పొద్దున్నే పరిగడపున తాగితే పొట్ట ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.
- భోజనం చేసిన తర్వాత చాలా మంది కిల్లీ వేసుకుంటారు. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహకరిస్తుందని చెబుతుంటారు.
- తిన్న తర్వాత నోట్లో బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుంది. దాన్ని నాశనం చేసి, నోటిని తాజాగా ఉంచడానికి తమలపాకు ఉపయోగపడుతుంది.
- అంతేకాదు ఇందులో యాంటీ డయాబెటిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
- చివరకు క్యాన్సర్ మహమ్మారి తీవ్రతను తగ్గించే లక్షణాలు కూడా తమలపాకులో ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
- ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది
అది మాత్రం ప్రమాదకరం :
తమలపాకును దైవారాధనతోపాటు ఆరోగ్యపరంగా ఎంతో మంది భారతీయులు వినియోగిస్తుంటారు. అదే సమయంలో మరికొందరు ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునే విధంగా కూడా ఉపయోగిస్తున్నారు. తమలపాకు, సున్నం, వంక్క వంటి పదార్థాలతోపాటు పొగాకును కలుపుకొని తినేవారు చాలా మంది ఉన్నారు. పొగాకు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిసిందే. దీన్ని తీసుకోవడమంటే "క్యాన్సర్"ను స్వయంగా ఒంట్లోకి ఆహ్వానించినట్టే. అందుకే ఏ రకంగానూ పొగాకును వినియోగించకూడదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ప్రకృతి ప్రసాదించిన తమలపాకును సంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగిస్తేనే అన్నివిధాలా బాగుంటుంది.

