భారతీయులు "చాయ్" ఎక్కువగా తాగడానికి అసలు కారణం ఇదేనట!
- ఇండియన్స్ TEAని ఎక్కువగా ఇష్టపడడానికి పలు కారణాలు చూపుతున్న నిపుణులు! - అవేంటో మీకు తెలుసా?

Published : September 7, 2025 at 5:32 PM IST
Why do Indians Drink Tea So Much : మనలో చాలా మందికి "టీ" పేరు చెబితే చాలు ఎక్కడ లేని హూషారూ, ఉత్సాహం పుట్టుకొస్తాయి. అలా ఫ్రెండ్స్, బంధువులతో ముచ్చట్లు చెప్పుకుంటూ వేడివేడిగా గొంతులోకి దిగుతుంటే స్వర్గం ఇంకెక్కడో లేదనిపిస్తుంది. కొందరికైతే కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలవ్వదు. ఇక ఛాయ్ ప్రేమికుల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదో ఒక టైమ్‌లో తేనీటి పానీయాన్ని తాగడానికి ఇష్టపడతారు. సాధారణ ప్రజలకు మాత్రమే కాదండోయ్ రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇతర రాజకీయ, సినీ ప్రముఖుల్లో ఎవరైనా ఒకచోట కలిశారంటే ముందుగా 'తేనీటి' విందు ఉండాల్సిందే. అంతలా భారతీయ సంస్కృతిలో 'టీ' భాగమైందని చెప్పుకోవచ్చు. మరి, ఇండియాలో "ఛాయ్" ఎందుకు అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది? భారతీయులు తేనీటి పానీయాన్ని అంతగా ఇష్టపడడం వెనుక దాగి ఉన్న కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒత్తిడిని దూరం చేస్తుంది :
కాలంతో పరిగెత్తే నేటి టెక్నాలజీ యుగంలో చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. డిప్రెషన్ అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఒక కప్పు టీ తాగితే ఒత్తిడి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మంచి నొప్పి నివారణిగా పనిచేయడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ పెంచి వర్క్‌పై దృష్టి కేంద్రీకరించడానికి తోడ్పడుతుంది. National Institutes of Health జరిపిన ఒక అధ్యయనంలో కూడా 'టీ' యాంటీ-డిప్రెసెంట్‌గా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.
మంచి ఫ్రెండ్షిప్ని ఏర్పరుస్తుంది :
నేడు విశేష జనాధరణ పొందిన టీ మంచి స్నేహాన్ని ఏర్పరచడంలోనూ సహాయపడుతుంది. ఏ ఇద్దరు వ్యక్తులు లేదా ఫ్రెండ్స్ కలిసి ముచ్చట్లు పెట్టాలన్నా ఛాయ్ ఉండాల్సిందే. 'టీ' తాగుతూ పరిచయాలు పెంచుకుని గొప్ప స్నేహితులుగా మారిన వారు చాలా మందే ఉండి ఉంటారు. నలుగురు కలిసి తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థికపరమైన విషయాలు, జీవిత అనుభవాలను చర్చించుకునే టైమ్‌లో కూడా తేనీటి పానీయం తప్పకుండా ఉంటుంది. లేకపోతే చర్చలు ముందుకు సాగవు. అంతలా ఇండియన్స్‌తో టీ మంచి సంబంధాన్ని ఏర్పరుచుకుందని చెప్పుకోవచ్చు.
ఇన్స్టంట్ టిఫెన్ :
టీ కేవలం పానీయంగానే కాకుండా కొన్ని సందర్భాల్లో టిఫెన్ తిన్న శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా రస్క్, బిస్కెట్లు, బ్రెడ్, మురుకులు, చపాతీ వంటి వాటితో ఛాయ్ తాగినప్పుడు కడుపు నిండిన ఫీలింగ్‌ని కలిగిస్తుంది. పిల్లలైతే ఇలా తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది మార్నింగ్ సమయాల్లో టిఫెన్ తినడానికి టైమ్ లేనప్పుడు దీనితోనే సరిపెడుతుంటారు.
టీ, కాఫీ ఎప్పుడు, ఎలా తాగితే లాభం? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

మంచి ఆతిథ్య ఆహ్వానం :
ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఏదైనా వేడుక జరిగినప్పుడు ముఖ్యమైన అతిథులు వచ్చినా ముందుగా టీ ఇచ్చి మర్యాదలు చేస్తుంటాం. ఇంటికొచ్చిన బంధువులు, అతిథులు కూడా మనం అందించే ఛాయ్ ఆతిథ్యాన్ని ఇష్టపడుతుంటారు.
వివిధ వెరైటీల్లో నూతనోత్తేజం :
మనం ఎన్నిసార్లు టీ తాగినా బోరింగ్ ఫీల్ రాదు. అలాగే, వివిధ ప్రాంతాల వైవిధ్యాలు, రుచులను బట్టి రకరకాల వెరైటీల్లో ఎప్పుడూ నూతనోత్తజాన్ని అందిస్తుంది టీ. అందుకు అనుగుణంగానే గ్రీన్ టీ నుంచి బ్లాక్ టీ వరకు ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, వివిధ రకాల టీలతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
సీజన్‌తో సంబంధం లేకుండా డిమాండ్ :
వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం అనే తేడా లేకుండా నిరంతరం తాగే పానీయాలలో ఒకటి టీ. సీజన్ ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా కడుపులోకి కప్పు టీ పోవాల్సిందే అంటారు చాలా మంది. మరి, ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో అయితే ఛాయ్‌కి ఉండే డిమాండ్ మరీ ఎక్కువే. ఇండియాలోని వేడి వాతావరణానికి ఇది సరైన పానీయం. ఎందుకంటే, ఇది శరీర వేడి, శీతలీకరణ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. కాబట్టి, టీని సీజన్‌తో సంబంధం లేకుండా తెగ తాగేస్తుంటారు.
ఆలోచనా సామర్థ్యం పెంచుతుంది :
కొన్నిసార్లు అలసిపోయినప్పుడు బాడీ మొత్తం డల్‌గా ఉంటుంది. అప్పుడు బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో కప్పు 'టీ' తాగితే ఎక్కడాలేని ఎనర్జీ పుట్టుకొస్తుంది. టీలోని సహజ పదార్ధాలలో ఒకటైన 'ఎల్-థయానైన్' అనేది ఏకాగ్రత, దృష్టిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాగే, మైండ్‌ను రీఫ్రెష్ చేసి ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. 'National Institutes of Health' జరిపిన ఒక అధ్యయనంలో కూడా రెగ్యులర్‌గా టీ తాగడం మెదడు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

నిద్రను దూరం చేస్తుంది :
పనిలో అడ్డుగా మారే నిద్రను దూరం చేయడానికి టీ ఒక మంచి పరిష్కారంగా భావిస్తారు చాలా మంది. దానిలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎనర్జీని పెంచి రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి తోడ్పడుతాయి. అలాగే, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు నుంచి వాటి నుంచి ఉపశమనాన్ని అందించడంలో టీ సహాయపడుతుందంటున్నారు.
తక్కువ ధరకు లభించే పానీయం :
చిన్నా, పెద్దా, పేదవారు, ధనికులు అనే తారతమ్యం లేకుండా అందరూ ఛాయ్‌ని చాలా ఇష్టంగా తాగుతుంటారు. పైగా ఇది అందరికీ అందుబాటు ధరలో దొరికే వాటిల్లో ఒకటి. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. ఇలా అనేక కారణాలతో ఇండియాలో టీకి విశేష ఆదరణ దక్కుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే భారతీయులు ఛాయ్‌ను ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతున్నారని చెబుతున్నారు.
రోజూ "గ్రీన్ టీ" ఆరోగ్యానికి మంచిదేనా? - మెడిసిన్ వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్?!
బ్రిటీష్ వాళ్ల కాఫీ, టీ రాకముందు - భారతీయులు ఏం తాగేవారో తెలుసా?

