Aloo Bukhara Health Benefits: సీజన్ల వారిగా మాత్రమే లభించే పండ్లలో ఆల్ బుకారా(Plum)ఒకటి. ముఖ్యంగా ఈ పండ్లు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. చూడటానికి యాపిల్ తీరుగా ఎర్రగా.. ఉంటాయి. ఇక రుచికి పుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే అని.. వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఈ సీజనల్ పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
పోషకాలు: ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. అంతేకాకుండా విటమిన్ సి, ఎ, డి, బి12, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ప్రయోజనాలు చూస్తే.:
- ఈ పండులో విటమిన్ సి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇది అలసటను తగ్గిస్తుంది. నీరసాన్ని దరి చేరనివ్వదు. దాంతో ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లు తలెత్తవని నిపుణులు అంటున్నారు.
- ఇందులోని విటమిన్-ఎ దంతక్షయం రాకుండా రక్షిస్తుంది. అలాగే కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని చెబుతున్నారు.
- ఈ పండులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- ఈ పండ్లలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
- 2019లో Journal of Medicinal Foodలో ప్రచురితమైన అద్యయనం ప్రకారం.. ఆల్బుకారా పండ్లలోని పోషకాలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కొరియాలోని Kyungpook National Universityలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ డాక్టర్ Jin-Hyang Lee పాల్గొన్నారు.
- "రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచేందుకు ఆల్బుకారాలోని ఎక్స్‌ట్రాక్ట్‌లు టైప్ 2 డయాబెటిస్ నిర్వహణకు ఉపయోగకరంగా ఉండవచ్చు" అని లీ పేర్కొన్నారు.
- ఈ పండులో పీచూ, మెగ్నీషియం, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఎముకలు పటిష్టమవుతాయి. అలాగే ఆర్థ్రరైటిస్, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అంటున్నారు.
- ఈ పండ్లు శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు జీవక్రియలతోపాటు రక్తప్రసరణనూ సాఫీగా సాగేలా చేస్తాయని అంటున్నారు. రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల పెరుగుదలకూ సాయపడుతుందని అంటున్నారు.
- ఈ పండ్లలోని పొటాషియం శరీర కణాలకు మేలు చేస్తుంది. గుండెపోటు, రక్తపోటును నియంత్రిస్తుంది.
- ఆల్ బుకారా పండ్లు తింటే.. శ్వాస, రొమ్ము సంబంధిత క్యాన్సర్లు రావని పలు పరిశోధనలు సైతం చెబుతున్నాయి.
- ఈ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. దీన్ని తరచూ తీసుకున్న వారిలో మలబద్ధకం సమస్య తగ్గుతుందని అంటున్నారు. ఇందులోని ఫైబర్ త్వరగా ఆకలి వేయకుండా ఆపుతుందని.. తద్వారా బరువు తగ్గేందుకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి:
బరువు తగ్గడం లేదని బాధపడుతున్నారా?- తింటూనే బరువు తగ్గొచ్చని తెలుసా!
అలర్ట్ : మీరు హై బీపీతో బాధపడుతున్నారా? - అయితే, ఇవి అస్సలు తినొద్దు - అవి తప్పక తినాలి!