How to Make Watermelon Sharbat: పుచ్చకాయలు సమ్మర్లో విరివిగా లభిస్తాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా కుప్పలుతెప్పలుగా కనిపిస్తుంటాయి. పైన పచ్చగా, లోపల ఎర్రగా నల్లటి గింజలతో లభించే ఇవి చాలా రుచిగా ఉంటాయి. రేటు కూడా తక్కువ ఉండటం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు.
ఎండాకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇక పుచ్చకాయలను చాలా మంది నేరుగా తింటే, కొద్దిమంది జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా రుచికరమైన షర్బత్ కూడా చేసుకోవచ్చు. మండే ఎండల్లో కూల్‌కూల్‌గా ఈ షర్బత్ తాగితే భలేగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ షర్బత్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- పుచ్చకాయ - 1
- సగ్గుబియ్యం - పావు కప్పు
- నల్ల ద్రాక్ష - అర కప్పు
- పటిక బెల్లం - పావు కప్పు
- జీడిపప్పు పలుకులు - కొద్దిగా
- కాచి చల్లార్చిన పాలు - 2 కప్పులు (అర లీటర్)
- ఉప్పు - చిటికెడు
- బీట్రూట్ జ్యూస్ - అర టీ స్పూన్
తయారీ విధానం:
- తాజా పుచ్చకాయను తీసుకొని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటి తొక్కలను తీసేసి, గింజలను తొలగించుకోవాలి.
- అలా సెపరేట్ చేసిన పుచ్చకాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని రెండు కప్పుల పరిమాణంలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- ఓ బౌల్లోకి సగ్గుబియ్యం తీసుకుని కొన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
- సగ్గుబియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన సాబుదానా వేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకుంటే మరో 5 నిమిషాలు ఎక్కువ ఉడికించుకోవాలి.
- సగ్గుబియ్యం ఉడికిన తర్వాత జల్లెడలో వేసి వడకట్టాలి. వెంటనే చల్లటి నీళ్లు పోసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- నల్ల ద్రాక్షను శుభ్రంగా కడిగి రౌండ్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు, ఉడికించిన సగ్గుబియ్యం, ద్రాక్ష ముక్కలు, పటిక బెల్లం, జీడిపప్పు పలుకులు, కాచి చల్లార్చిన చిక్కటి పాలు, ఉప్పు, బీట్రూట్ జ్యూస్ పోసి బాగా కలుపుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పుచ్చకాయ షర్బత్ రెడీ.
- ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి పోసుకుని పైన ఐస్‌క్యూబ్స్, పుచ్చకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఒకటికి రెండు గ్లాసులు తాగేస్తారు. మరి నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
సమ్మర్ స్పెషల్ - టేస్టీ అండ్ హెల్దీ "వాటర్ మెలన్ జ్యూస్‌లు" - క్షణాల్లో రెడీ!