Ugadi Special Recipe : ప్రతి పండక్కీ ఏదో ఒక స్పెషల్ వంటకం ఉండనే ఉంటుంది. అలానే తెలుగు సంవత్సరాదిగా పిలుచుకునే ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడి ఇందుకు మినహాయింపు కాదు. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు వంటి షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటుంటారు తెలుగువారు. ఇది రుచిలోనే కాదు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలోనూ చాలా బాగా తోడ్పడుతుంది. అయితే, మనందరం ఇక్కడ ఉగాది పచ్చడిని ఎలాగైతే సాంప్రదాయబద్ధంగా ప్రిపేర్ చేసుకొని ఆస్వాదిస్తామో, అలాగే మన పక్కన రాష్ట్రం తమిళనాడులో ఉగాది నాడు ఒక స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటారు.

అక్కడ ఉగాదిని "పుదు వరుష పిరప్పు" అని పిలుస్తారు. ఈరోజు తమిళులు మన ఉగాది పచ్చడిలానే "వెప్పం పూ రసం" తయారు చేసుకొని తాగుతారు. ఇదీ చాలా రుచికరంగా ఉండి తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి, ఈ పండక్కి మీరూ ఉగాది పచ్చడిని ఎప్పటిలా రొటీన్‌గా కాకుండా ఇలా తమిళుల స్టైల్లో చేసుకొని చూడండి. ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఆస్వాదించామనే ఫీలింగ్‌ని పొందుతారు. మరి, ఈ స్పెషల్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? తయారీ విధానమేంటో ఈ స్టోరీలో చూద్దాం.

రెసిపీకి తీసుకోవాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - చింతపండు రసం
- ఒక కప్పు - కందిపప్పు
- రెండు పెద్ద చెంచాలు - వేప పువ్వు
- రెండు చెంచాలు - బెల్లం
- కొద్దిగా - కొత్తిమీర
- అర చెంచా - పసుపు
- అర చెంచా - ఆవాలు
- రెండు పెద్ద చెంచాలు - నెయ్యి
- రుచికి తగినంత - ఉప్పు
- రెండు చెంచాలు - ఆయిల్
- మూడు - ఎండుమిర్చి
- చిటికెడు - ఇంగువ
- ఐదు రెమ్మలు - కరివేపాకు
ఉగాది నాడు బొబ్బట్లు రొటీన్ - ఈసారి "పూరీ పాయసం" కూడా చేసుకోండి! - రుచి అమృతమే!

వెప్పం పూ రసం తయారీ విధానమిలా :
- ఇందుకోసం వేప కొమ్మల నుంచి రెండు పెద్ద చెంచాల పరిమాణంలో తాజా వేప పువ్వును సేకరించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న వేప పువ్వును వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో అదనంగా మరికొంత నెయ్యిని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి.
- అది వేడయ్యాక ఆవాలు వేసి కాస్త చిటపటమనే వరకు వేయించాలి.
- అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, కందిపప్పు ఇలా ఒకదాని తర్వాత మరొకటి యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి.

- అవి కూడా మంచిగా వేగిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకొని, పసుపు, బెల్లం తురుము వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద మిశ్రమం మంచిగా ఉడికే వరకు బాగా కుక్ చేసుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇక చివర్లో సరిపడా వేయించి పక్కన పెట్టుకున్న వేప పువ్వును వేసుకొని కలుపుకోవాలి.
- ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మరిగించుకొని దింపేసుకుంటే చాలు.
- సూపర్ టేస్టీ అండ్ హెల్దీ తమిళనాడు స్పెషల్ "వెప్పం పూ రసం" రెడీ!
ఉగాది రోజు నోరూరించే "రాగి బొబ్బట్లు" - శనగ, మైదా పిండి పడనివారికి చక్కటి అవకాశం!
విశ్వావసు నామ సంవత్సరం - ఉగాది నుంచి ఈ 3 రాశుల వారికి అఖండ రాజయోగం! - మీరు ఉన్నారేమో చూసుకోండి