పాతకాలం పద్దతిలో "వంకాయ ఎండు నెత్తళ్ల కూర" - అద్దిరిపోయే రుచితో ముద్దకో ముక్క తినేస్తారు!
- ఎండు చేపలు ఇవి వేరే లెవల్ - వేడివేడి అన్నంలో రెండు ముద్దలు ఎక్కువే తింటారు!

Published : April 4, 2025 at 2:46 PM IST
Vankaya Netthalla Curry: పచ్చి చేపలతో చేసిన వంటలు తిన్నంత ఇష్టంగా ఎండు చేపల వంటలు తినలేరు చాలా మంది. కారణం వాటి నుంచి అదో రకమైన స్మెల్ వస్తుందని. అయితే ఓసారి ఈ పద్ధతిలో వంకాయలు ఉపయోగించి ఎండు చేపల కూర చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా నీచు వాసన అస్సలే రాదు. కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వివిధ రకాలు మసాలాలు ఉపయోగించి చేయడం వల్ల ముద్దకో ముక్క పెట్టుకుని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. మరి వంకాయ, ఎండు నెత్తళ్ల కూర ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు:
- లేత వంకాయలు - 1 కిలో
- ఎండు నెత్తళ్లు - 1/4 కిలో
- పెద్ద ఉల్లిపాయలు - 2
- పండిన టమాటాలు - 4
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర - కొద్దిగా
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- పసుపు - 1/2 టీ స్పూన్
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - 3-4 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1/2 టీ స్పూన్
- జీలకర్ర - 1/2 టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:
- ముందుగా ఎండు నెత్తళ్లను శుభ్రం చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్లోకి వేడి నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఎండు చేపల తల, తోకలు తీసేసి నీటిలో వేసుకోవాలి.
- ఇలా అన్నింటి తలలు, తోకలు తీసేసి నీటిలో వేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. పెద్ద నెత్తళ్లు అయితే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- కూరకు అవసరమయ్యే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచాలి.
- మరో బౌల్లోకి నీరు తీసుకుని అందులోకి ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు వంకాయల కాడలు తీసేసి మరీ చిన్నగా , మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్లో ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు కలిపిన నీటిలో వేసుకోవాలి.
- ఎండు చేపలు నానిన తర్వాత వాటిపై ఉండే పొట్టు తొలగించి, అన్నిటినీ ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులోకి ఎండు నెత్తళ్లు వేసి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.

- అదే నూనెలోకి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం పాటు వేయించి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి లేత గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
- అనంతరం తరిగిన టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి.
- వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత అర లీటర్ నీరు పోసి సుమారు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత వేయించిన నెత్తళ్లు వేసి కలిపి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అయితే ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసుకుని తక్కువైతే మరికొంచెం వేసుకోవాలి.
- వంకాయలు, ఎండు నెత్తళ్లు మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అన్నంలోకి ఈ కూరను వేసుకుని తింటే సరి. ఎంతో రుచికరంగా ఉండే వంకాయ ఎండు నెత్తళ్ల కూర రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- కూరను మరింత రుచిగా చేయడానికి, కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవచ్చు.
- ఎండు నెత్తళ్లను నీటిలో నానబెట్టడం వల్ల వాటిలో దుమ్ము, ధూళి ఏమైనా ఉంటే పోతుంది.
- వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల ముక్కల రంగు మారదు.
పాతకాలపు పద్ధతిలో "ఎండు రొయ్యల కూర" - ఆ రుచికి మైమరచిపోతారు!
తందూరీ స్టైల్ వంకాయ కర్రీ - ఈ అద్భుత రుచిని మరిచిపోలేరు - ప్రిపరేషన్ వెరీ ఈజీ!

