సరికొత్త రుచిలో "వంకాయ మెంతికూర కర్రీ" - అన్నం, చపాతీ, రోటీల్లోకి కమ్మగా!
రుచి అద్దిరిపోతుంది - సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు

Published : August 7, 2025 at 4:30 PM IST
Vankaya Menthikura Curry Recipe : ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువ మంది తోటకూర, పాలకూర, గోంగూర తిన్నట్లు మెంతికూరను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుందనే భావనతో చాలా మంది దాన్ని పక్కన పెడుతుంటారు. అలాంటి వారికోసం ఒక అద్భుతమైన కాంబో రెసిపీని తీసుకోచ్చాం. అదే, నోరూరించే "వంకాయ మెంతికూర కర్రీ". వంకాయ కాంబినేషన్లో ఎలాంటి కర్రీలు చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కూడా అదే కోవకు చెందుతుంది. ఇలా చేసి పెట్టారంటే మెంతికూర అంటే నచ్చనివాళ్లూ ఇష్టంగా తింటారు. డిఫరెంట్ కాంబోలో భలే రుచికరంగా ఉండే ఈ రెసిపీ అన్నంతో పాటు చపాతీ, రోటీల్లోకి వావ్ అనిపిస్తుంది. మరి, ఈ కమ్మని వంకాయ మెంతికూర కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అవసరమైన పదార్థాలు :
- మెంతికూర - నాలుగు కట్టలు
- వంకాయలు - అరకేజీ
- మీడియం సైజ్ టమాటాలు - నాలుగు
- ఉల్లిపాయలు - రెండు(మీడియం సైజ్‌వి)
- నూనె - ఐదారు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - ఒకటీస్పూన్
- జీలకర్ర - ఒకటీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
- జీలకర్ర పొడి - ఒకటీస్పూన్
- కారం - రెండు చెంచాలు(తగినంత)
- సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా
తియ్య తియ్యగా "బెల్లం మెంతి దోశలు" - ఎన్నడూ తినని టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తారు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా చిన్న సైజ్ మెంతికూరను తీసుకొని వేరు భాగం వరకు కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మెంతికూరను ఒక గిన్నెలోకి తీసుకొని మట్టి, ఇతర మలినాలు పోయేలా శుభ్రంగా కడిగి మరో బౌల్లో వేసుకొని పక్కనుంచాలి.
- అలాగే, తాజా తెల్ల గుండ్రని వంకాయలను తీసుకొని మీడియం సైజ్‌లో క్యూబ్స్ మాదిరిగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఉప్పు నీరు తీసుకొని అందులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి.
- అదేవిధంగా, రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయలు, టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్‌ని సిద్ధం చేసుకోవాలి.

మసాలా పేస్ట్ కోసం :
- లవంగాలు - ఏడెనిమిది
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- పచ్చిమిర్చి - ఐదారు
- అల్లం - అంగుళం ముక్క
- వెల్లుల్లి రెబ్బలు - 12
- ఎండుమిర్చి - ఐదు
పెసరపప్పుతో ఘుమఘుమలాడే "పులగం" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - ప్రసాదంగా పర్ఫెక్ట్!

- ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి ముక్కలు, సన్నని అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద కర్రీకి అనుగుణంగా ఉండే గిన్నె లేదా పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- అవి వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసి అందులోని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో కాసేపు వేయించుకోవాలి.
- ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసి సన్నని సెగ మీదనే మూడ్నాలుగు నిమిషాల పాటు వేయించాలి.
- ఇలా మెంతికూరను కొద్దిసేపు నూనెలో వేయించడం ద్వారా చేదు లేకుండా కర్రీ కమ్మగా వస్తుంది.

- మెంతికూర చక్కగా వేగాక ముందుగా కట్ చేసుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్‌గా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత కరివేపాకు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అవన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై స్టవ్‌ను లో ఫ్లేమ్‌లోనే ఉంచి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

- ఆవిధంగా ఉడికించుకున్నాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని అవన్నీ వంకాయ ముక్కలకు చక్కగా పట్టేలా లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా కలుపుతూ రెండుమూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
- ఒకవేళ కర్రీ మాడుతున్నట్లనిపిస్తే వీలైనంత తక్కువ వాటర్‌ని డ్రాప్స్‌లా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి.
- ఆ మిశ్రమం మంచిగా ఉడికిందనుకున్నాక ఆఖర్లో సన్నని కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "వంకాయ మెంతికూర కర్రీ" రెడీ అయిపోతుంది!
కరకరలాడే "కోడిగుడ్డు పకోడీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

