క్యాటరింగ్ స్టైల్ "గుత్తి వంకాయ కర్రీ" - మసాలాలు కూర్చే అవసరం కూడా లేకుండా ఈజీగా!
ఫంక్షన్ స్టైల్ వంకాయ కర్రీ - ఫంక్షన్ స్టైల్లో ఈజీగా ఇలా చేసుకోండి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2025 at 3:31 PM IST
Vankaya curry recipe in telugu : "ఆహా ఏమిరుచి తినరా మైమరచి" అంటే వంకాయ కూర తప్ప మరొకటి గుర్తుకు రాదు. వంకాయకు అంత రుచి ఎందుకంటే ఇది అది కూరగాయల్లో రారాజు. అందుకేనేమో! వంకాయ కూరల్లో ఉన్న వెరైటీలు మరే ఇతర కూరగాయల్లో లేవు. సరిగ్గా చేయాలే గానీ వంకాయ కూర మటన్ కర్రీకి ఏ మాత్రం తీసిపోదు. వంకాయల్లో మసాలా కూరే అవసరం లేకుండా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం.
"పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం" - ఇలా చేస్తే ఎన్ని గంటలైనా గట్టిపడదు!

కావాల్సిన పదార్థాలు :
- వంకాయలు - అరకిలో
- వేరు శనగలు - 3 స్పూన్లు
- ఎండు కొబ్బరి - 2 స్పూన్లు
- నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
- యాలకులు - 2
- లవంగాలు - 3
- దాల్చిన చెక్క - కొద్దిగా
- ఆవాలు - 1 స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
- అనాస పువ్వు - 1
- ఉప్పు- రుచికి సరిపడా
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - అర స్పూన్
- ధనియాల పొడి - 2 స్పూన్లు
- వేయించిన జీలకర్ర పొడి - అర స్పూన్
- చింత పండు రసం - కొద్దిగా
- టేస్టింగ్ సాల్ట్ - 1 పావు స్పూన్
- టమోటాలు - 2

తయారీ విధానం :
- అరకిలో లేత నల్ల వంకాయలు తెచ్చుకుని శుభ్రం చేసుకుని గుత్తి విడిపోకుండా నాలుగు చీలికలుగా చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు పోసుకుని గుప్పెడు ఉప్పు వేసుకుని వంకాయలు మునిగేలా నీళ్లుపోసుకుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తడి లేకుండా చూసుకోవాలి.
- వంకాయలు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె చిట్లి మీద పడకుండా తడి లేకుండా చూసుకోవాలి. ఇపుడు కడాయిలో వంకాయలు మునిగే వరకు నూనె పోసుకుని ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత బయటకు తీసుకుని ఉప్పు వేసి పైకి, కిందికి కదుపుతూ పట్టించాలి.

- కడాయిలో వేరు శనగలు, ఎండు కొబ్బరి వేసుకుని మంచి రంగు వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో వేయించాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకుని మూడు నిమిషాలు వేయించాలి. ఇదే సమయంలో ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకుని యాలకురుల, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికించుకున్న టమోటా ముక్కలు వేసుకుని రుబ్బుకోవాలి.

- ఇపుడు వంకాయలు వేయించుకున్న నూనెలో కర్రీకి పట్టే నూనె పోను మిగతాది పక్కన పెట్టుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుతో పాటు కొద్దిగా అనాసపువ్వు వేసుకుని వేయించాలి. గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత టమోటా, పల్లీల పేస్ట్ వేసుకుని నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుతూ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి.

- అంతా బాగా కలిపిన తర్వాత పచ్చివాసన పోయాక చింత పండు రసం పోసుకోవాలి. మిక్సీ జార్లో నీళ్లు పోసి కడాయిలో పోసుకోవాలి. ఇపుడు టేస్టింగ్ సాల్ట్ వేసుకుని గ్రేవీలోకి వేయించిన గుత్తి వంకాయలు వేసుకుని కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా మసాలా అడుగు పట్టకుండా మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. అంతే! ఘుమఘుమలాడే వంకాయ కర్రీ రెడీ!
నోరూరించే పల్లెటూరి "రోటి పచ్చడి" - పెరుగన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ నంజుకున్నట్టు!
చక్కెర, బెల్లం లేకుండా చల్లచల్లని "హెల్డీ డ్రింక్" - రాగి పిండితో ఇలా చేస్తే చుక్క కూడా మిగలదు!

