Vajravalli Pachadi Recipe in Telugu : కొన్ని పచ్చళ్లు మంచి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు చెప్పబోయే పచ్చడి కూడా అదే రకానికి చెందుతుంది. నేటి రోజుల్లో చాలా తక్కువ మందికి దీని గురించి తెలిసి ఉంటుంది. అదే, అమ్మమ్మల నాటి "వజ్రవల్లి పచ్చడి". తీగ జాతికి చెందిన వజ్రవల్లినే 'నల్లేరు, బోన్ సెట్టర్ ప్లాంట్, అస్థి సంహార' అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో నల్లేరును మంచి మెడిసిన్‌లా యూజ్ చేస్తుంటారు. ఎన్నో ఔషధగుణాలు కలిగిన ఇది వయసు పెరగడం ద్వారా వచ్చే నడుము నొప్పి, కీళ్ల నొప్పులకు మంచి ఔషధంలానూ పనిచేస్తుంది. కాల్షియం అధికంగా కలిగి ఉండి ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. దగ్గు, కఫం వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా నల్లేరుతో చేసుకునే ఈ పచ్చడి చాలా బాగా సహాయపడుతుంది! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి, లేట్ చేయకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నల్లేరు కాడలతో మీరు ఓసారి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకొని చూడండి.

కావాల్సిన పదార్థాలు :
- నల్లేరు కాడలు - పావుకిలో
- నూనె - ఒక టేబుల్‌స్పూన్
- మెంతులు - చిటికెడు
- ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- తెల్ల నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 12(రుచికి తగినన్ని)
- టమాటాలు - నాలుగైదు
- ఉప్పు - రుచికి తగినంత
- చింతపండు - ఉసిరికాయ సైజంత
- పసుపు - పావుటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు
- సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా తాజా నల్లేరు కాడలను తగిన పరిమాణంలో తీసుకోవాలి. ఆపై వీటి కాడల పీచు తీసుకునే చేతికి కాస్త నూనె రాసుకొని ఆపై చాకుతో తొలగించుకోవాలి. ఎందుకంటే ఇవి దురదను కలిగించే ఛాన్స్ ఉంటుంది.
- నల్లేరు కాడల పీచు తీసుకున్నాక వాటన్నింటిని రెండు లేదా మూడు ఇంచుల పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు నీటిలో రెండు మూడుసార్లు శుభ్రం చేసుకోవాలి. చివరగా మంచి నీటిలో ఒకసారి శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మెంతులు, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు వేసుకొని సన్నని సెగ మీద మాడిపోకుండా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- తర్వాత అదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా కాగిన తర్వాత పచ్చిమిర్చి తుంపలు, ముందుగా కడిగి పెట్టుకున్న నల్లేరు ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్‌లో అవి లోపలి వరకు చక్కగా వేగేలా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి.

- అనంతరం అదే పాన్‌లో మరికాస్త ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్‌లో టమాటాలు చక్కగా మగ్గే వరకు కలుపుతూ వేయించాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఇప్పుడు రోలు లేదా మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత అందులో వేయించుకున్న పచ్చిమిర్చి, నల్లేరు కాడలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి.
- ఆపై పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఉడికించి చల్లార్చుకున్న టమాటా మిశ్రమం యాడ్ చేసుకొని మెత్తని పచ్చడిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి తాలింపు పెట్టుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - ఒకట్రెండు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- శనగపప్పు - ఒకటీస్పూన్
- మినపప్పు - ఒకటీస్పూన్
- ఎండుమిర్చి - ఒకటి
- కరివేపాకు - కొద్దిగా
- ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నూనె లైట్‌గా కాగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
- పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకొన్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "వజ్రవల్లి పచ్చడి" రెడీ!

ఈ చిట్కాలతో పర్ఫెక్ట్ టేస్ట్ :
- ఈ రెసిపీకి కావాల్సిన నల్లేరు కాడలు బయట మార్కెట్లో, ఆన్లైన్లో లభిస్తాయి.
- పచ్చడిలోకి కావాల్సిన పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని తీసుకోవాలి.
- నల్లేరు కాడలకు దురదను కలిగించే స్వభావం ఉంటుంది. కాబట్టి వాటిని లోపలి వరకు వేగేలా మంచిగా వేయించుకోవాలి.
- ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవడం కంటే రోట్లో రుబ్బుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది.
ఉల్లిపాయ పచ్చిమిర్చితో అద్దిరిపోయే "పచ్చడి"! - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పాతకాలం నాటి కమ్మని "కందిపప్పు పచ్చడి" - వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!