Easy and Tasty Vada Recipe : ఈవెనింగ్ స్నాక్స్ అందరికీ ఇష్టమే. కానీ, బిజీ లైఫ్లో చాలా మందికి సాధ్యం కాదు. స్నాక్స్ చేయడం ఒక పెద్ద పనిగా కూడా భావిస్తారు. అందుకే, ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు. కానీ, కేవలం 3 ఉల్లిపాయలు, 5 నిమిషాల సమయంతో అద్భుతమైన స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు. అదే, ఉల్లిపాయ వడలు. మరి, ఈ కరకరలాడే వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- మీడియం సైజు ఉల్లిపాయలు మూడు
- బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు
- శనగపిండి ఒక కప్పు
- నాలుగు పచ్చిమిర్చి
- ఒక స్పూన్ కారం
- స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు
- చిన్న పిడికెడు కొత్తిమీర తరుగు
- డీప్ ఫ్రై కోసం ఆయిల్
- తగినంత ఉప్పు
రోజూ అదే ఉప్మా పెడితే ఎలా తింటారు? - ఈసారి "బ్రెడ్ ఉప్మా" పెట్టండి - కిర్రాగ్గా కుమ్మేస్తారు!
సింపుల్గా తయారు చేసుకోండిలా :
- మొదట ఉల్లిపాయలను పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు గిన్నెలో వేసుకొని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేయాలి.
- వాటన్నింటినీ చేత్తో బాగా కలపాలి. ఉల్లిపాయల్లోని తేమతో మిశ్రమం కాస్త తడిగా మారుతుంది.
- ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి వేసి, పిండి ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
- పిండి కలిపిన తర్వాత కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి.
- తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి.
- వేడెక్కిన తర్వాత, పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అరచేతిలో కొద్దిగా ఒత్తుకొని వడల ఆకారంలో తయారు చేసుకోవాలి.
- ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేయాలి.
- రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- అంతే, సూపర్ టేస్టీ "వడలు" రెడీ. వీటని ఏ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.
టిప్స్ :
- ఈ రెసిపీలోకి ఉల్లిపాయ ముక్కలు మరీ లావుగా కాకుండా, సన్నగా ఉంటే వడలు బాగా వస్తాయి.
- ఇందులో బియ్యప్పిండి వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. అలాగే, వడలను వేయించుకునేటప్పుడు రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి.
శనగపిండి పకోడీలతో గ్యాస్ ట్రబుల్ సమస్యా? - జొన్నపిండితో చేసుకుంటే హెల్దీ స్నాక్ రెడీ!