ఉడుపి స్టైల్లో నోరూరించే "బీరకాయ పప్పు" - ఉల్లి, వెల్లుల్లి లేకుండానే సూపర్ టేస్ట్!
- సరికొత్త పద్ధతిలో కమ్మని 'పప్పు' - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు!

Published : September 5, 2025 at 12:31 PM IST
Udupi Temple Style Beerakaya Pappu : ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీరకాయ ఒకటి. కానీ, పిల్లలతో పాటు కొంతమంది పీచుగా ఎక్కువగా ఉండే దీన్ని అంతగా తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే, అలాంటి వారందరూ ఇష్టంగా తినే ఒక సూపర్ రెసిపీ ఉంది. అదే, ఉడుపి టెంపుల్ స్టైల్ "బీరకాయ పప్పు". ఇది రెగ్యులర్‌గా చేసుకునే పప్పు కర్రీలను మించిన టేస్ట్‌తో భలే రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే ఈ పప్పుని కమ్మగా రెడీ చేసుకోవచ్చు. మరి, మీరు కూడా కన్నడిగులు ఇష్టంగా తినే ఈ బీరకాయ పప్పుని ఓసారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - అర కప్పు
- పెసరపప్పు - అర కప్పు
- బీరకాయలు - 600 గ్రాములు
- టమాటాలు - రెండు
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - టేస్ట్‌కి సరిపడా
- మిరియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్
- సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మకాయ - ఒకటి

కొబ్బరి పేస్ట్ కోసం :
- నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు
- మినపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- సన్నని అల్లం తరుగు - ఒక టీస్పూన్
- పచ్చిమిర్చి - ఐదారు(రుచికి తగినన్ని)
- సన్నని పచ్చికొబ్బరి ముక్కలు - అర కప్పు
కారప్పూసతో కరకరలాడే "తియ్యని లడ్డూలు" - ఐదు పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

తయారీ విధానం :
- ఉడుపి టెంపుల్ స్టైల్ కమ్మని పప్పు కర్రీ తయారీకి ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- పప్పు నానేలోపు రెసిపీలోకి అవసరమైన తాజా లేత బీరకాయలను తీసుకొని పీలర్‌తో మొత్తం చెక్కు తీసేయకుండా కేవలం కణుపుల వద్ద మాత్రమే తొలగించుకోవాలి.
- ఆపై వాటిని శుభ్రంగా కడిగి మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్‌లో క్యూబ్స్ మాదిరిగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కనుంచాలి. అలాగే, టమాటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు పెసరపప్పు మిశ్రమం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
- ఆపై మూడున్నర కప్పుల వరకు మంచి నీళ్లు పోసి ఒకసారి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
- పప్పు మిశ్రమం మెత్తగా ఉడికి కుక్కర్లో ప్రెషర్ మొత్తం బయటకు వెళ్లిపోయాక మూత తీసి పప్పుగుత్తి లేదా గరిటెతో మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద ఒక కడాయిలో నూనె పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నని సెగ మీద వేయించాలి.
పెళ్లిళ్లలో చేసే కమ్మని "టమాటా పప్పు" ఇంట్లోనే! - ఘుమఘుమలాడిపోద్ది!

- మినపప్పు కలర్ మారుతున్నప్పుడు జీలకర్ర, సన్నని అల్లం తరుగు వేసి అది పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించాలి.
- ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, సన్నని పచ్చికొబ్బరి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.
- అవి ఆ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం మెదుపుకొని పక్కనుంచిన పప్పు మిశ్రమంలో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలపాలి.
- తర్వాత ఆ గిన్నెను మళ్లీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ బాగా ఉడకనివ్వాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- చివరగా నిమ్మ చెక్కలను రసం పిండుకొని కలిపి తాలింపు పెట్టుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - ఒకట్రెండు చెంచాలు
- జీలకర్ర - ఒకటీస్పూన్
- ఇంగువ - పావుటీస్పూన్
- ఎండుమిర్చి - నాలుగు
- కరివేపాకు - కొద్దిగా
- పసుపు - పావుటీస్పూన్

- పోపు కోసం స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి తాలింపుని చక్కగా వేయించాలి.
- తాలింపు వేగాక దింపే ముందు పసుపు వేసి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- తర్వాత ఆ తాలింపుని ముందుగా రెడీ చేసుకున్న పప్పు మిశ్రమంలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- అంతే, ఉడుపి టెంపుల్ స్టైల్లో నోరూరించే కమ్మని "బీరకాయ పప్పు" రెడీ అవుతుంది!
- ఒకవేళ మీరు తక్కువ పరిమాణంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కందిపప్పుతో పాటు ఇతర ఇంగ్రీడియంట్స్ని కాస్త తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
కమ్మని "వంకాయ మీల్ మేకర్ కర్రీ" - చిక్కని గ్రేవీతో ఇంటిల్లిపాదీకి నచ్చుతుంది!

