Tomato Kothimeera Chutney Making Process : కొత్తిమీర ఒక మంచి పోషకాహారం. అయితే మనందరం కొత్తిమీరను రుచికోసమో, సువాసనకోసమో కూరలు, సాంబారు, రసాలు వంటి వాటిలో వేస్తుంటాం. ఇక నాన్‌వెజ్ రెసిపీలు, బిర్యానీ వంటి చేసుకున్నప్పుడు మాత్రం ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, ఎప్పుడూ కొత్తిమీరను వంటల్లో సైడ్ క్యారెక్టర్‌గా కాకుండా మెయిన్ లీడ్‌గా ఉపయోగించి అద్దిరిపోయే రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర అంటే నచ్చని పిల్లలు కూడా ఈ చట్నీని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :
- ఈ పచ్చడిలో తగినంత కారం కోసం పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ చట్నీకి సరికొత్త టేస్ట్‌ని ఇస్తాయి. అయితే, ఇవి మీ కారానికి తగినట్లు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి.
- కొత్తిమీరను వేయించుకునేటప్పుడు మరీ నీరు లేకుండా డ్రైగా మగ్గించుకోవద్దు. ఎందుకంటే పచ్చడి గుజ్జు గుజ్జుగా రావాలంటే కాస్త మగ్గితే సరిపోతుంది.
- ఇక్కడ మీరు ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేసి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన పదార్థాలు :
- కొత్తిమీర - ఒక పెద్ద కట్ట(150 నుంచి 180 గ్రాములు)
- టమాటాలు - నాలుగైదు
- పల్లీలు - 1 టేబుల్‌స్పూన్
- నూనె - అర టేబుల్‌స్పూన్
- పచ్చిశనగపప్పు - అర టేబుల్‌స్పూన్
- మినపప్పు - అర టేబుల్‌స్పూన్
- ధనియాలు - ఒక టీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- మెంతులు - పావుటీస్పూన్
- పచ్చిమిర్చి - ఐదారు
- ఎండుమిర్చి - 7 నుంచి 8
- తెల్ల నువ్వులు - 1 టేబుల్‌స్పూన్
- చింతపండు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 7 నుంచి 8
- ఉప్పు - రుచికి సరిపడా
- మీడియం సైజ్ ఉల్లిపాయ - ఒకటి
హోటల్ స్టైల్ "గట్టి చట్నీ" - ఈ కొలతలతో చేసుకుంటే కిర్రాక్ టేస్ట్ - నిమిషాల్లో సిద్ధం!

తయారీ విధానమిలా :
- ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా, కొత్తిమీరను తరుక్కొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అయితే, కొత్తిమీరను మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద సైజ్‌లోనే తరుక్కోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి.
- అవి వేగాక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి తుంపలు, ఎండుమిర్చిని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- దినుసులన్నీ వేగాక చివరగా ఆ మిశ్రమంలో తెల్ల నువ్వులు వేసి వేడి మీద కొద్దిసేపు రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ఆ దినుసులను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.

- ఆలోపు స్టవ్ మీద అదే పాన్ ఉంచి మరో టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, శుభ్రంగా కడిగిన చింతపండు వేసి కలుపుతూ కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టమాటాలు సాఫ్ట్‌గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి.
- టమాటాలు మగ్గిన తర్వాత అందులో కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసి కాసేపు మగ్గించుకోవాలి. అంతేకానీ, మరీ డ్రైగా అయ్యేంత వరకు మగ్గించుకోవాల్సిన పనిలేదు.
- కొత్తిమీరను మగ్గించుకునేటప్పుడే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి.
- కొత్తిమీర మిశ్రమం చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ చేసుకొని పాన్ని దింపి పక్కనుంచాలి.
పచ్చి మామిడి, పచ్చి కొబ్బరి - 5 నిమిషాల్లోనే అద్దిరిపోయే తాజా "చట్నీ" - ఈ సీజన్పోతే దొరకదు!

- ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమం వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- ఆ తర్వాత అందులో మగ్గించుకున్న కొత్తిమీర టమాటా మిశ్రమం, ఉప్పు వేసుకొని రోట్లో దంచుకొన్న మాదిరిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
- తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకున్న మిగిలిన పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు పచ్చడికి తాలింపుని సిద్ధం చేసుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - 3 నుంచి 4 టేబుల్‌స్పూన్లు
- తాలింపు గింజలు - 2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - చిటికెడు
- ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసి దోరగా వేయించుకోవాలి.
- అవి వేగాక కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, నోరూరించే కమ్మని "కొత్తిమీర టమాటా పచ్చడి" రెడీ అయిపోతుంది!
- ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది మరింత అద్భుతంగా ఉంటుంది. రోలు అందుబాటులో లేనివారు మిక్సీలో ప్రిపేర్ చేసుకోవచ్చు.
తిన్నాకొద్దీ తినాలనిపించే ఉడికించిన "కోడిగుడ్డు పచ్చడి" - ఇలా చేసి పెడితే ఇంట్లో వారందరూ ఫిదా!
పల్లీలు, కొబ్బరి, చింతపండు లేకుండానే - టిఫెన్స్లోకి సూపర్ "చట్నీ"! - గ్యాస్ సమస్యకు బెస్ట్ ఆప్షన్!