Tips to Grow Money Plant : ప్రస్తుత కాలంలో చాలా మంది గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంట్లో ఖాళీ స్థలం లేకపోయినా కుండీల్లోనే రకరకాల మొక్కల్ని పెంచుకుంటున్నారు. ఆ మొక్కలలో మనీ ప్లాంట్ కూడా ఒకటి. ఇంటి గుమ్మం దగ్గర, బాల్కనీ, హాల్ వంటి చోట్ల మనీ ప్లాంట్ పెంచుకుంటుంటారు. దీనిని పెంచుకుంటే మంచిదని, ఆర్థిక సమస్యలు తొలగుతాయనే ఉద్దేశంతో కూడా చాలా మంది వీటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఈ చలికాలంలో మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారడం, ఎండిపోవడం అధికంగా కనిపిస్తుంది. దీంతో పచ్చగా ఉండే మొక్కని అలా చూస్తే చాలా బాధ కలుగుతుంది. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనీ ప్లాంట్ చక్కగా పచ్చగా గుబురుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..
అరటి తొక్కలు : మనలో చాలా మంది అరటిపండ్లు తిన్న తర్వాత ఆ తొక్కలను చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, ఈ తొక్కల్ని మనీ ప్లాంట్‌కు మంచి ఎరువుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం అరటి పండు తొక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీలో వేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ బాక్స్‌లోకి తీసుకోండి. ఇందులో పేస్ట్‌కి డబుల్ వాటర్ పోసి కలపండి. తర్వాత బాక్స్‌పై మూతపెట్టి నైట్ మొత్తం అలా ఉంచండి. మరుసటి రోజు మనీ ప్లాంట్‌కి ఈ వాటర్ పోయండి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే మొక్క పచ్చగా మారుతుందంటున్నారు.
ఉల్లిపాయ తొక్కలు, టీ ఆకులతో : మనం ఉల్లిపాయలు కట్ చేయడం కోసం పైన రెండుమూడు పొరలను తీసేస్తుంటాం. అయితే, మనీ ప్లాంట్ ఎరువు కోసం వీటిని ఉపయోగించవచ్చుంటున్నారు. అందుకోసం ఉల్లిపాయ పొరలను ఎండబెట్టి.. తర్వాత వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పొడి రెడీ చేసుకోండి. ఈ పొడిలో తాజా టీ ఆకుల్ని వేసి మిక్స్ చేయండి. ఆపై ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో పొడిని వేసి వాటర్ యాడ్ చేయండి. దీనిని రెండు రోజులపాటు అలా వదిలేయండి. తర్వాత మనీ ప్లాంట్‌కి ఈ నీళ్లు పోస్తే పచ్చగా, ఏపుగా పెరుగుతుందని అంటున్నారు.
మరిన్ని టిప్స్:
- మనీ ప్లాంట్‌ని ఇంట్లో నేరుగా సూర్యరశ్మి పడే చోట ఉంచవద్దు. ఇలా చేస్తే మొక్క ఆకులు రంగు మారతాయి. కాబట్టి, ఇంట్లో నీడ ఉండే ప్రదేశంలో మొక్కని ఉంచండి.
- అలాగే చలికాలంలో మనీ ప్లాంట్‌కి రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. కుండీలో మట్టి ఎండిపోయినట్లుగా కనిపించినప్పుడు రెండు గ్లాసుల నీటిని పోస్తే సరిపోతుందంటున్నారు.
- మొక్కను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి.
- కుండీ అడుగు భాగంలో రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల నీరు నిలిచి ఉండకుండా ఉంటుంది.
- అలాగే ఎప్పటికప్పుడూ పాత ఆకులు, పాడైన కొమ్మలను తొలగించండి.
- ఇలా చేస్తే మనీ ప్లాంట్ పచ్చగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
వాస్తుప్రకారం మనీ ప్లాంట్‌కు ఈ వస్తువు కడితే - ఆర్థిక సమస్యలన్నీ పరార్!
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ ఉంది? - వాస్తు ప్రకారం ఏ దిశలో ఉండాలో తెలుసా?