Tiffin center chutney : రోడ్ల వెంట టిఫిన్ బండ్లపై ఇచ్చే పల్లీ, పుట్నాల చట్నీలతో పాటు టమోటా చట్నీ ఎంతో బాగుంటుంది. ఇది పల్చగా చాలా రుచిగా ఉంటుంది. పల్లీ గట్టి చట్నీ వేసుకుని, టమోటా చట్నీ నంజుకుని తింటుంటే ఇడ్లీ, దోసెల రుచి ఎంతో బాగుంటుంది. కానీ, ఇంట్లో ఎంత ట్రై చేసినా టమోటా చట్నీ పల్చగా రాదు. ఒకవేళ నీళ్లు పోసి చేస్తే రుచిగా ఉండదు. అందుకే ఇవాళ టమోటా నీర్ చట్నీ రెసీపీ ట్రై చేయండి! అచ్చం హోటళ్లలో ఇచ్చే చట్నీ మాదిరిగానే ఉంటుంది.
మహిళలు తప్పక తినాల్సిన "స్వీట్" ఇది! - రక్తహీనత, ఐరన్ లోపం ఉంటే ట్రై చేయండి

కావాల్సిన పదార్థాలు
- టమోటాలు - 3 మీడియం సైజు
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఉల్లి పాయలు - మీడియం సైజు 1
- వెల్లుల్లి - 6
- ఎండు మిర్చి - 8
- కశ్మీరీ చిల్లీ - 3
- నూనె - 2 టీ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- మినపగుండ్లు - అర టీ స్పూన్
- ఇంగువ - పావుటీ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- దోసె పిండి లేదా ఇడ్లీ పిండి - టేబుల్ స్పూన్
- బెల్లం - చిటికెడు
- కొత్తి మీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం
- ముందుగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కశ్మీరీ చిల్లీ మిక్సీ జార్ లోకి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమోటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పేస్ట్ పట్టుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- ఇపుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టీ స్పూన్ల నూనె అర టీ స్పూన్ ఆవాలు, మినపగుండ్లు, పావుటీ స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసుకుని చిటపటలాడించాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటూ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమోటా పేస్ట్ వేసుకుని నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే చట్నీ రుచిగా ఉంటుంది.
- ఈ సమయంలో ఒక గిన్నెలోకి పులిసిన దోసె లేదా ఇడ్లీ పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని కలిపి పలుచని మజ్జిగలా తీసుకోవాలి. ఈ లోగా నాలుగైదు నిమిషాల్లో టమోటా మిశ్రమం దగ్గర పడి నూనె తేలుతుంది. ఇపుడు అర లీటరు నీళ్లు పోసుకుని బాగా కలుపుకొని నాలుగైదు నిమిషాలు బాగా మరిగించాలి.
- మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసె పిండి లేదా ఇడ్లీ పిండి కలుపుకోవడం వల్ల చట్నీ పల్చగా ఉండడంతో పాటు చాలా రుచిగా బాగుంటుంది. ఇపుడు కొద్దిగా బెల్లం వేసుకుని కలుపుకొని మరోసారి మరిగించి చివరగా కొత్తి మీర తరుగు చల్లుకుని దించుకుంటే సరిపోతుంది.
"పాలక్ పుల్కా" ఇలా చేసి చూడండి - గంటల కొద్దీ మృదువుగా ఉంటుంది!
"పచ్చిమిర్చి కారప్పొడి" ఎప్పుడైనా ట్రై చేశారా? - నిల్వ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు!