IMD WEATHER ALERT : నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలో ఉండగా, ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే కారణంగా ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అల్పపీడనాలు కాస్తా క్రమంగా వాయుగుండాలు, తుపాన్లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితుల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో బంగాళాఖాతంలో అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో 11 తుపాన్లు ఏర్పడగా, అందులో 6 ఏపీలోనే తీరం దాటి విధ్వంసం సృష్టించాయి.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వర్షం, గాలుల తీవ్రత ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. వర్షపాతం, గాలిలో వేగం తీవ్రత ఆధారంగా అవి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేస్తుంది.
బంగాళాఖాతం ఉగ్రరూపం ! - పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు - ఇక నెలంతా తుపాన్లే
గ్రీన్ అలర్ట్ (Green Alert)
ఏదైనా ప్రాంతంలో 24గంటల వ్యవధిలో 6.4సెంటీ మీటర్ల కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ శాఖ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణంలో రాబోయే మార్పుల గురించి ఈ అలర్ట్ తెలియజేస్తుంది. అయితే తక్కువ వర్ష పాతం నమోదయ్యే అవకాశాలున్నందున ఈ అలర్ట్ ద్వారా ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.
ఎల్లో అలర్ట్ (Yellow Alert)
ఒక ప్రదేశంలో 6.45 సెంటీ మీటర్ల నుంచి 11.55 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం, అంచనాల మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం ప్రతి కూలంగా మారుతుందని అర్థం. దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటుంది. మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వరద ఉప్పొందే ప్రమాదం ఉంటుంది కాబట్టి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి సూచిస్తారు.
ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)
24 గంటల వ్యవధిలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఐఎండీ (India Meteorological Department) ఈ అలర్ట్ ను జారీ చేస్తుంది. ఈ సమయంలో గాలుల తీవ్రత 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఉంటుంది. పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలిస్తారు. ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యిందంటే వరద ముప్పు పొంచి ఉన్నదనే హెచ్చరిక వచ్చినట్టే.
రెడ్ అలర్ట్ (Red Alert)
వాతావరణం, వర్షపాతానికి సంబంధించి ఇది చివరి హెచ్చరికగా చెప్పుకోవచ్చు. 24గంటల వ్యవధిలో ఒక ప్రాతంలో 20.45 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే వీలుంటే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ ప్రమాద హెచ్చరిక అత్యంత ప్రతి కూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిందని అర్థం. ఈ సమయంలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం తోపాటు రోడ్లపైకి వరద పోటెత్తడం, రవాణా, వాహనాల రాకపోకలకు అంతరాయం ఉంటుంది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఐఎండీ ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో విపత్తు నిర్వహణా దళాలు, ఐఎండీ బృందాలు, రెస్క్యూ సహాయక సిబ్బందితో పాటుస్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉంటాయి. రెడ్ అలర్ట్ దాదాపు ఐదు రోజుల పాటు అమల్లో ఉంటాయి.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
రెడ్ అలర్ట్ టూ శ్రీకాకుళం- 'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి' - IMD Issues Red Alert To srikakulam