Tasty Onion Chutney Recipe: "ఉల్లిపాయలు" దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. కూరలు, చారు, పప్పు ఇలా ఏ రకం వెరైటీలు చేసినా దీనిని కచ్చితంగా వేయాల్సిందే. కేవలం తాలింపులోకి మాత్రమే కాకుండా పకోడీ, వడలు వంటి వాటిలో కూడా ముఖ్యం. అయితే ఉల్లితో అద్దిరిపోయే పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడితో ఆరోజు హ్యాపీగా గడిచిపోతుంది. పైగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, బోండా, దోశ, ఊతప్పం వంటి టిఫెన్స్కు పర్ఫెక్ట్. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయలు - 3 పెద్దవి
- టమాటా - 1
- ఎండుమిర్చి - 15
- చింతపండు - చిన్న ఉసిరికాయంత
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- మెంతులు - అర టీస్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత

తాలింపు కోసం:
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- పచ్చి శనగపప్పు -1 టీ స్పూన్
- మినప్పప్పు - 1 టీ స్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - కొన్ని రెబ్బలు
- కొత్తిమీర - కొద్దిగా (గార్నిష్ కోసం)

తయారీ విధానం:
- ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే పాన్‌లో తరిగిన ఉల్లిపాయలు వేసి ఓ నిమిషం పాటు మగ్గించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి సుమారు 5 నిమిషాలపాటు లో-ఫ్లేమ్‌లో వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి ఎండుమిర్చి మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- మళ్లీ స్టవ్ ఆన్ చేసి పాన్‌లో కొద్దిగా నూనె చేసి వేసి వేడి చేయాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి చిటపటలాడించాలి.
- ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి ఓ నిమిషం ఫ్రై చేసి కరివేపాకు వేసుకోవాలి.
- కరివేపాకు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన చట్నీని వేసి లో ఫ్లేమ్‌లో 3 నిమిషాలు ఉడికించాలి. చివరగా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి రెడీ.
- ఈ ఉల్లిపాయ చట్నీ వేడి వేడి అన్నంతో సహా ఇడ్లీ, దోశతో తింటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- ఉల్లిపాయలను లేతగా వేయించడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. పచ్చి వాసన ఉండదు.
- అయితే మరీ ఎక్కువగా వేయిస్తే పచ్చడి తీపి వస్తుంది.
- పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకుంటే బాగుంటుంది.
పాతకాలం పద్దతిలో "వంకాయ ఎండు నెత్తళ్ల కూర" - అద్దిరిపోయే రుచితో ముద్దకో ముక్క తినేస్తారు!
"వడలు" నూనె తాగేసి ఉబ్బిపోతున్నాయా? - పప్పులో ఇదొక్కటి కలిపితే చాలు - అస్సలు పీల్చుకోవు!