శనగపిండి లేకుండా "మిర్చి బజ్జీలు" - ఇలా చేస్తే నూనె పీల్చకుండా కమ్మగా వస్తాయి!
-అందరూ మెచ్చే టేస్టీ మిర్చి బజ్జీలు -సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా!

Published : June 11, 2025 at 5:28 PM IST
Tasty Mirchi Bajji without Besan Flour: సాయంత్రం అయ్యిందంటే చాలా మంది బజ్జీలను ఇష్టంగా లాగిస్తుంటారు. వేడివేడి బజ్జీలను ఉల్లిపాయ స్టఫ్ఫింగ్, టమాటా చట్నీతో తింటుంటే ఆ కిక్కే వేరు. అందుకే చాలా మంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమో, బయట కొనుక్కొని తినడమో చేస్తుంటారు. అయితే బజ్జీలు చేయాలంటే ముఖ్యంగా కావాల్సినది శనగపిండి. గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్లు ఈ పిండితో చేసిన బజ్జీలు తినాలంటే ఆలోచిస్తారు. కానీ ఈ పిండి లేకపోతేనేమో ఈ స్నాక్స్ చేయడం కష్టం. అయితే ఇక శనగపిండితో పనిలేకుండా క్రిస్పీగా అండ్ టేస్టీగా బజ్జీలు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ప్రిపరేషన్ కూడా వెరీ ఈజీ. మరి లేట్ చేయకుండా ఈ బజ్జీలు ఎలా వేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- బజ్జీ మిరపకాయలు - 15
- పెసరపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
- పసుపు - చిటికెడు
- ఉప్పు - రుచికి సరిపడా
- బేకింగ్ సోడా - అర టీస్పూన్
- వాము పొడి - 1 టీస్పూన్

తయారీ విధానం:
- బజ్జీలు వేసుకునేందుకు శనగపిండి ప్లేస్‌లో పెసరపిండి ఉపయోగించాలి. ఓ బౌల్లోకి పెసరపిండి, బియ్యప్పిండి, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీలు వేసుకునేందుకు సరిపడేలా పిండిని కలుపుకోవాలి.
- పిండిలో నీళ్లు కరెక్ట్‌గా సరిపోయిన తర్వాత ఒకే డైరెక్షన్లో సుమారు 10 నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేయాలి. ఇలా కలపడం వల్ల పిండి స్మూత్‌గా మారుతుంది.

- ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి పక్కన పెట్టాలి. బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి.
- ఆ తర్వాత వాటిని మధ్యలోకి చీల్చి చివర కొద్దిగా కట్ చేసుకోవాలి. అనంతరం అందులోని గింజలు తీసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలను రెడీ చేసుకోవాలి.
- ఇప్పుడు బజ్జీల్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. అందుకోసం ఓ గిన్నెలోకి వాము పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కట్ చేసిన బజ్జీ లోపల పెట్టుకోవాలి. ఇలా బజ్జీలన్నింటికీ స్టఫింగ్ పెట్టుకుని పక్కన పెట్టాలి.

- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి పెట్టాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- ఈ లోపు కలిపిన పిండి మిశ్రమంలో బేకింగ్ సోడా వేసి మరికొద్దిసేపు కలపాలి. నూనె కాగిన తర్వాత ఓ మిర్చి తీసుకుని పిండిలో ముంచి అంచుకు రాసి ఆయిల్ వేసుకోవాలి.
- ఇలా మీరు తీసుకున్న కడాయి సైజ్‌ను బట్టి మిర్చిలు నూనెలో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ను మీడియంలో పెట్టి బజ్జీలను వెంటనే కలపకుండా ఓ రెండు నిమిషాల తర్వాత కలుపుతూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

- ఇలా కాలిన వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకుని తీసుకోవాలి. బజ్జీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే నూనె ఏమైనా ఉన్నా పీల్చుకుంటుంది.
- ఇలా తయారు చేసుకున్న బజ్జీలను టమాట చట్నీ, ఉల్లిపాయ స్టఫ్ఫింగ్తో సర్వ్ చేసుకుంటే శనగపిండి లేకుండానే మిర్చి బజ్జీలు రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

టిప్స్:
- పెసరపిండి అన్ని సూపర్ మార్కెట్స్, ఆన్లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది. ఒకవేళ మీకు లభించకపోతే షాపు నుంచి పెసరపప్పు కొని దానిని ఎండబెట్టి మిల్లు పట్టించి వాడుకుంటే సరిపోతుంది.
- వాము స్టఫ్ఫింగ్ ప్లేస్‌లో చింతపండు గుజ్జు మిశ్రమాన్ని కూడా స్టఫ్ చేసుకుని కూడా బజ్జీలు వేసుకోవచ్చు.
- నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బజ్జీలు వేసుకుని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి.
- నూనె సరిగా కాగకపోతే బజ్జీలు నూనె పీల్చుకుంటాయి.
- మీరు కలుపుకునే పిండిని బట్టి బజ్జీలు వస్తాయి. ఎందుకంటే పిండి మరీ గట్టిగా కలుపుకుంటే బజ్జీలకు ఎక్కువ పిండి పట్టి నూనెలో సరిగ్గా వేగవు. అదే పల్చగా మిక్స్ చేసుకుంటే పిండి సరిగా పట్టక బజ్జీలు పల్చగా వస్తాయి. కాబట్టి పిండిని ఓసారి కలుపుకున్న తర్వాత వేలు ముంచి చూస్తే కోటింగ్ సరిపోతుంది అనుకుంటే బజ్జీలు వేసుకోవచ్చు. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు, లూజుగా అనిపిస్తే మరికొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు.
ఇలా "పల్లీ చట్నీ" చేసుకోండి - బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఇష్టంగా తింటారు - హోటల్ టేస్ట్ పక్కా!
సగ్గుబియ్యం, శనగపప్పుతో క్రిస్పీ "పునుగులు" - ఇలా చేశారంటే నూనె పీల్చకుండా గుల్లగా వస్తాయి!

