Tasty and Healthy Sesame Laddu: మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు రీ ఓపెన్ కానున్నాయి. ఇక స్కూల్‌కు వెళ్లొచ్చిన పిల్లలు స్నాక్స్ కావాలని గోల చేస్తుంటారు. అయితే చిన్నారులు స్నాక్స్ కావాలన్నప్పుడు ఏదో ఒకటి పెట్టకుండా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ లడ్డూను ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. బెల్లం, పంచదార లేకుండా చేసే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. పైగా పాకం అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేస్తే సుమారు 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలకు రోజుకో లడ్డూ ఇచ్చారంటే బలంగా తయారవుతారు. మరి లేట్ చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- నువ్వులు - 140 గ్రాములు(1 కప్పు)
- పల్లీల్లు - అర కప్పు(70 గ్రాములు)
- అవిసె గింజలు - అర కప్పు(70 గ్రాములు)
- ఖర్జూరాలు - 70 గ్రాములు(20)
- యాలకులు - 5

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి కలుపుతూ చిటపటలాడేంతవరకు వేయించుకోవాలి.
- నువ్వులు వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి. అదే పాన్‌లోకి పల్లీలు వేసి మంచిగా వేయించి వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే పాన్‌లో అవిసె గింజలు వేసి ఓ మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- ఇవి చల్లారేలోపు ఖర్జూరాల్లోని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- మిక్సీజార్‌లోకి చల్లారిన నువ్వులు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అవిసె గింజలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి.

- ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం వేసి మెత్తగా నువ్వుల మిశ్రమానికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి తీసుకుని లడ్డూల చుట్టుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తే సరి. లేదంటే మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- చివరగా వేయించిన పల్లీలు వేసి పల్స్ మోడ్‌లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.

- చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలా చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పొడి మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకోవాలి.
- ఇలా చేసుకున్న వాటిని గాలి చొరబడని, తడి లేని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా, మరెంతో హెల్దీగా ఉండే నువ్వుల లడ్డూ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- నువ్వులు, పల్లీలు, అవిసె గింజలను కేవలం లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించాలి. మరీ ముఖ్యంగా నువ్వలను ఎక్కువసేపు వేయిస్తే అవి రంగు మారడమే కాకుండా లడ్డూలు చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త చిటపటలాడేవరకు వేయిస్తే సరి.
- ఒకవేళ ఖర్జూరాలను గ్రైండ్ చేయాల్సిన పనిలేదు అనుకున్న వారు సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని గ్రైండ్ చేసిన నువ్వుల మిశ్రమంలో కలిపి లడ్డూలుగా చుట్టుకుంటే సరి.
తమిళనాడు "గోల్డెన్ పూరీ", నోరూరించే కుర్మా - కచ్చితంగా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు!
తియ్యతియ్యగా నోరూరించే "జర్దా పులావ్" - అన్నం వండుకునేంత ఈజీగా చేసుకోవచ్చు! - రుచి అమోఘం!