Tasty and Healthy Jonna Pindi Pakoda: మెజార్టీ పీపుల్ ఫేవరెట్ స్నాక్ 'పకోడీ'. అందుకే తినాలనిపించినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా మంది వీటిని తయారు చేస్తుంటారు. నిమిషాల్లో తయారవ్వడమే కాదు, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు బానే ఉన్నా పకోడీలు చేయాలంటే శనగపిండి చాలా ముఖ్యం. అయితే ఈ పిండితో తయారు చేసిన స్నాక్స్ తింటే గ్యాస్ట్రబుల్, ఎసిడిటీ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలోనే వీటిని తినడమే మానేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా చాలా హెల్దీగా పకోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా జొన్నలతో.
జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది జొన్న పిండితో రొట్టెలు, దోశలు, ఇడ్లీలు వంటి వంటకాలు చేసుకుని తింటున్నారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా రుచికరమైన పకోడీలు కూడా చేసుకోవచ్చు. పైగా ఇవి చాలా టేస్టీగా ఉండి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మరి లేట్ చేయకుండా జొన్న పకోడీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయలు - 5
- పచ్చిమిర్చి - 4
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- వాము - పావు టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- జొన్న పిండి - 2 కప్పులు
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:
- ఉల్లిపాయలను పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఓ బౌల్లోకి కట్ చేసి ఉల్లి, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, వాము, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- ఉల్లిపాయలను గట్టిగా పిండుతూ ఈ మసాలాలు కలపడం వల్ల నీరు కిందకు దిగుతుంది.
- ఇప్పుడు అందులోకి జొన్న పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత నీళ్లు అవసరమనుకుంటే కొద్దికొద్దిగా పోసుకుంటూ కలపాలి. పకోడీ వేయడానికి అనువుగా పిండిని కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి.
- స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దికొద్దిగా పిండిని పకోడీల్లా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన పకోడీలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్ట్స్రా నూనె ఏమైనా ఉంటే ఆ పేపర్ పీల్చుకుంటుంది.
- ఇలా పిండి మొత్తాన్ని పకోడీలుగా వేసుకోవాలి. మొత్తం రెడీ అయిన తర్వాత పకోడీలను టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే అద్దిరిపోతాయి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

పకోడీలు రుచికరంగా రావడానికి టిప్స్:
- పకోడీలు మరింత రుచిగా ఉండాలంటే కొద్దిగా బియ్యప్పిండిని కూడా కలుపుకోవచ్చు
- పిండిలో పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే రుచి. ఒకవేళ మీకు మిర్చి వద్దనుకుంటే ఎండుకారం వేసుకుంటే సరి.
- జొన్నపిండితో పకోడీలను వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. లేదంటే నూనె పీల్చుకుంటాయి.
- పకోడీలు మరింత రుచికరంగా ఉండాలంటే కొంచెం సాంబార్ పొడి కూడా కలుపుకోవచ్చు.
అమోఘమైన "చేప తలకాయ" పులుసు - ఈ స్టైల్లో వండితే మరువలేని రుచి - గుండె ఆరోగ్యానికీ మేలు!
ఎండాకాలంలో పెరుగు పుల్లగా మారుతోందా? - ఈ ఒక్కటి కలిపి 'తోడు' పెడితే అద్భుతమైన రుచి!