ETV Bharat / offbeat

ఉల్లిపాయ వేసి "కారప్పూస" చేయండి - సూపర్​ టేస్టీ అండ్​ క్రంచీ - పిల్లలు ఇష్టపడతారు!

- పిల్లల కోసం సూపర్ స్నాక్ ప్రిపేర్ చేయండి - నూనె కూడా తక్కువగానే పీల్చుకుంటుంది!

Tasty and Crispy Karapusa
Tasty and Crispy Karapusa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 14, 2025 at 1:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tasty and Crispy Karapusa: కారప్పూస అంటే చాలా మందికి ఇష్టం. పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని పండగల సమయంలో, తినాలనిపించినప్పుడు ఎక్కువగా చేసుకుంటుంటారు. అంతేకాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసి పిల్లలకు స్నాక్స్​గా కూడా పెడుతుంటారు. ఇక దీనిని చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఓసారి ఇలా ఉల్లిపాయ వేసి కారప్పూస చేయండి. అద్భుతంగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ నచ్చుతుంది. మరి లేట్​ చేయకుండా కరకరలాడే కారప్పూస ఎలా చేసుకోవాలో చూసేయండి.

Besan Flour
శనగపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • శనగపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - 2 కప్పులు
  • ఉల్లిపాయ - 1
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • కారం - 2 టీస్పూన్లు
  • వాము - అర టీస్పూన్​
  • ఉప్పు - సరిపడా
  • పసుపు - పావు టీస్పూన్​
  • బటర్​ లేదా నూనె - పావు కప్పు
Rice Flour
బియ్యప్పిండి (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయపై పొట్టు తీసేసి మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసుకోవాలి. మిక్సీజార్​లోకి వాము, జీలకర్ర వేసి పొడి అయ్యేలా ఓసారి గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్​లా చేసి పక్కన పెట్టుకోవాలి.
  • పెద్ద వెడల్పాటి బేషన్​ లేదా ప్లేట్​లోకి శనగపిండి, బియ్యప్పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.
  • అనంతరం గ్రైండ్​ చేసి ఉల్లిపాయ పేస్ట్​ వేసి పిండికి పట్టేలా మిక్స్​ చేసుకోవాలి. చివరగా కరిగించిన బటర్​ లేదా వేడి నూనె పోసి పిండి మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి.
Onions
ఉల్లిపాయలు (Getty Images)
  • పిండిని కొద్దిగా తీసుకుని ముద్దలాగా చేసినప్పుడు పర్ఫెక్ట్​గా వస్తే సరి. లేదంటే మరికొంచెం నూనె పోసుకుని కలుపుకోవాలి.
  • పిండిలోకి కొద్దికొద్దిగా వాటర్​ పోస్తూ సాఫ్ట్​ ముద్ద వచ్చేవరకు కలుపుకోవాలి. పర్ఫెక్ట్​గా కలుపుకున్న తర్వాత ఆరిపోకుండా మూత పెట్టడం లేదా తడిక్లాత్​ కప్పడం చేయాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కేలోపు కారప్పూసకు సంబంధించిన గొట్టం తీసుకుని సన్న బిళ్లను సెట్​ చేసుకోవాలి. ఆ తర్వాత లోపలి భాగానా ఆయిల్​ అప్లై చేయాలి.
Jeera
జీలకర్ర (Getty Images)
  • కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకుని జంతికల గొట్టంలో పెట్టి క్లోజ్​ చేసుకుని కాగిన నూనెలో రౌండ్​ షేప్​లో వత్తుకోవాలి.
  • మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి వెంటనే కదపకుండా ఓ రెండు మూడు నిమిషాల తర్వాత సన్నని పుల్ల సాయంతో చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి.
  • కారప్పూస రోల్​ ఓవైపు కాలిన వెంటనే రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా వేగిన తర్వాత టిష్యూ పేపర్​ ఉన్న ప్లేట్​ లేదా జల్లి గిన్నెలోకి తీసుకోవాలి.
  • కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలానే కారప్పూసగా నూనెలో వత్తుకుని రెండు వైపులా వేయించుకోవాలి.
  • ఇలా కాల్చుకున్న వాటిని చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కారప్పూస రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Karapusa
కారప్పూస (ETV Bharat)

చిట్కాలు:

  • శనగపిండి ఎంత తీసుకుంటే దానికి రెండింతలు బియ్యప్పిండి తీసుకోవాలి. అంటే పైన చెప్పినట్టు ఒక కప్పు శనగపిండికి, రెండు కప్పుల బియ్యం పిండి. అదే శనగపిండి రెండు కప్పులు అయితే బియ్యప్పిండి నాలుగు. అయితే రెండింటిని కొలవడానికి ఒకటే కప్పు ఉపయోగించాలి.
  • వాము, జీలకర్రను పొడిగా కాకుండా నేరుగా కూడా నలిపి తీసుకోవచ్చు. అయితే మీరు సన్న కారప్పూస చేయాలనుకున్నప్పుడు మాత్రం పొడిగా కలుపుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వేసినప్పుడు గొట్టంలో నుంచి అవి కిందకు దిగవు.
  • ఈ కారప్పూస మరింత రుచిగా ఉండాలంచే మెత్తగా గ్రైండ్​ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్​ కూడా వేసుకోవచ్చు.
  • మీకు పిండి కలిపిన తర్వాత ఉప్పు సరిపోలేదనుకుంటే ఈ చిట్కా ట్రై చేయండి. అదేంటంటే కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలో పెట్టుకునేటప్పుడు చేతులు తడి చేసుకుని పిండిని కూడా కొద్దిగా తడుపుతుంటారు. కాబట్టి ఆ వాటర్​లో కొద్దిగా ఉప్పు వేసి కరిగించుకుంటే పిండిని తడుపుకునేటప్పుడు ఉప్పు సరిపోతుంది.

నోరూరించే "పల్లీ కారం పొడి" - పర్ఫెక్ట్​ రుచితో వేడివేడి అన్నంలోకి అమృతమే - 3 నెలలు నిల్వ!

మైదా, గోధుమపిండి లేకుండా ఉప్మా రవ్వతో "పూరీలు" - నూనె పీల్చకుండా చక్కగా పొంగుతాయి!