Rava Sweet Recipe without Pakam : మనందరం ఇంట్లో రవ్వ ఉంటే ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా, ఇడ్లీ, ఊతప్పం వంటివి చేసుకుంటుంటాం. ఇక తీపి వంటకాల విషయానికొస్తే రవ్వ లడ్డూలు ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాం. కానీ, అవి మాత్రమే కాకుండా రవ్వతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొనే ఒక అద్దిరిపోయే స్వీట్ రెసిపీ ఉంది. పాకంతో పని లేకుండా ఇంట్లో ఉన్న తక్కువ పదార్థాలతోనే సింపుల్‌గా దీన్ని చేసుకోవచ్చు. టేస్ట్ కూడా స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఒకటికి రెండు లాగిస్తారు. మరి, ఇంతకీ నోరూరించే ఆ స్వీట్ ఏంటి? దానికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్
- బొంబాయి రవ్వ - ఒక కప్పు
- చక్కెర - ముప్పావు కప్పు
- మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ - ఒక టేబుల్‌స్పూన్
- పచ్చికొబ్బరి సన్నని తురుము - ఒక టేబుల్‌స్పూన్
- ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు(ఆప్షనల్)
- డ్రైఫ్రూట్స్ తరుగు - కొద్దిగా(గార్నిష్ కోసం)
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక బొంబాయి రవ్వను వేసి బాగా ఫ్రై చేయాలి.
- స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు మాడిపోకుండా మంచి సువాసన వచ్చేంత వరకు రవ్వను బాగా వేయించుకోవాలి.
- రవ్వ చక్కగా వేగి లైట్‌గా కలర్ మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- తర్వాత అదే పాన్‌లో చక్కెరను తీసుకొని ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లను పోసుకొని పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి. అంతేకానీ, పాకం పట్టాల్సిన పనిలేదు.
- అది కరిగే లోపు ఒక మిక్సింగ్ బౌల్లో మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అరకప్పు వరకు నీళ్లను పోసుకొని ఉండలేమి లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద మరిగించుకుంటున్న వాటర్‌లో చక్కెర పూర్తిగా కరిగిందనుకున్నాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వాటర్‌ని మరోసారి కలిపి పోసుకోవాలి.
- ఆపై సన్నని పచ్చికొబ్బరి తురుము వేసుకొని మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి రెండుమూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి.
- తర్వాత ఈ స్వీట్ బర్ఫీ మంచి కలర్ఫుల్గా కనిపించడానికి కాస్త ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి మరో రెండుమూడు నిమిషాల పాటు ఉడికించాలి.
- ఆ మిశ్రమం చక్కగా ఉడికి కాస్త చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఉండలు కట్టకుండా కలుపుతూ కొద్దికొద్దిగా వేసుకోవాలి.

- రవ్వను మొత్తం వేసుకున్నాక ఒకసారి ఎక్కడా ఉండలు లేకుండా కలపాలి. చక్కగా మిక్స్ చేసుకున్నాక అది కాస్త దగ్గర పడే వరకు కలుపుతూ సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు(ఫొటోలో చూపించిన విధంగా) ఉడికించుకోవాలి.
- చివరగా ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం ఒక వెడల్పాటి అంచులు ఉండే ఫ్లేట్ తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకొని అంతా సమానంగా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆపై డ్రైఫ్రూట్స్ తరుగు చల్లుకొని అది బర్ఫీకి పట్టేలా ఏదైనా చిన్న గిన్నెతో కాస్త వత్తాలి. తర్వాత దాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచాలి.
- అది చల్లారాక మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే సూపర్ టేస్టీ "రవ్వ కస్టర్డ్ బర్ఫీ" రెడీ!

టిప్స్ :
- ఇక్కడ రవ్వను మాడిపోకుండా ఎంత బాగా వేయించుకుంటే స్వీట్ టేస్ట్ అంత రుచికరంగా వస్తుంది.
- మీరు స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడేవారు అయితే పంచదారను ఒక కప్పు వరకు తీసుకోవచ్చు.
- ఈ స్వీట్ తయారీలో ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వాడుతున్నాం. ఒకవేళ మీరు అది వద్దనుకుంటే మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు.
- ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసి చేసుకోవడం ద్వారా రెసిపీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలాగే, పచ్చికొబ్బరి తురుము కూడా అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇవి రెండు వేసుకోవడం ద్వారా స్వీట్ రెసిపీకి సరికొత్త రుచి వస్తుంది.
- ఇక్కడ స్వీట్ బర్ఫీ మంచి కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్‌ని తీసుకుంటున్నాం. మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు.
ఎప్పుడైనా "చంద్రకళ స్వీట్" తిన్నారా? - బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండి నోరూరిస్తుంది!
బియ్యప్పిండితో "బెల్లం గవ్వలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు - వారం రోజులు నిల్వ!